Friday, December 20, 2024

మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా దామోదర్

- Advertisement -
- Advertisement -

వరంగల్  : మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీని ఖరారు చేసింది. రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న రాష్ట్ర కార్యదర్శి పోస్టును భర్తీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన తాడ్వాయి మండలం, కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నకు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం దామోదర్ మిలిటరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో కార్యాకలాపాలు నిర్వహించడమే కాకుండా ఏరియాపై గట్టి పట్టు ఉండడంతో దామోదర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

దూకుడుగా వ్యవహరించే దామోదర్ నేతృత్వంలో తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాన్ని పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రామాలపై పూర్తిస్థాయి పట్టు ఉన్న దామోదర్‌ను నియమించినట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో కేంద్ర కమిటీ బాధ్యులు సమావేశమై రాష్ట్ర కార్యదర్శి ఎంపిక విషయంలో సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. దామోదర్‌తో పాటు ఆజాద్ పేరును కూడా చర్చించినట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం లాల్ ఘడ్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాత్కాలికంగా రాష్ట్ర బాధ్యతలను దామోదర్ కు అప్పగించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మూడు దశాబ్దాల ఉద్యమ నేపథ్యం
బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కు మావోయిస్ట్ ఉద్యమంతో విడదీయరాని బంధం ఉన్నది. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు.. కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసింది. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతమైన తాడ్వాయి మండలం, కాల్వపల్లి నుంచి మావోయిస్ట్టు ఉద్యమంలో చేరా రు. దళ సభ్యుడు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కేకెడబ్ల్యూ కార్యదర్శిగా పనిచేశారు. మిలిటరీ చీఫ్ స్థాయికి ఎదిగారు. ఎన్నో ఘటనల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

బడే దామోదర్ సోదరుడు బడే నాగేశ్వరరావు, ఆయన సతీమణి ఇద్దరు కూడా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ ఎన్కౌంటర్లలో నేలకొరిగారు. దామోదర్ కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్‌లు కొనసాగించిన అనేక మార్లు తప్పించుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమంతా దామోదర్‌కు కొట్టిన పిండి. తాడ్వాయి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, మూడు దశాబ్దాలకు పైగా తిరగడం వల్ల గ్రామాల్లో పట్టు ఉన్నది. గ్రామాల కనెక్టివిటీ, గుట్టలకు దారి, షెల్టర్లకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నది. తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువ కాలం ఉంటూ తమకున్న నెట్ వర్క్ మేరకు కార్యకలాపాలను సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News