Sunday, December 22, 2024

కర్ణాటక జలదోపిడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కర్ణాటక ప్రభుత్వం జలదోపిడీని యదేశ్చగా కొనసాగిస్తోంది. కృష్ణానదితోపాటు దీనికి ప్రధాన ఉపనదులుగాఉన్న తుంగ, భద్ర, ఘట ప్రభ , మలప్రభ తదితర నదులపై ఎత్తిపోతల పథాకాలు నిర్మించి నీటిని తోడేస్తోంది. కృష్ణానదీజలాలను బచావత్ ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపులకంటే 350టిఎంసీల నీటిని అధికంగా అక్రమంగా వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. కృష్ణానదీజల వివాదాల పరిష్కారం కోసం 1976లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీజలాల్లో ఈ నదీ పరివాహకంగా ఉన్న భాగస్వామ్య రాష్ట్రాలకు నీటికేటాయిపుంలు జరిపింది. కృష్ణానదీ పరివాహకంగా వందేళ్ల వర్షపాత రికార్డులను పరిగణలోకి తీసుకుని 75శాతం నీటి లభ్యత అధారంగా నదిలో 2130టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు నిర్ధారించింది.

అందులో ఎగువ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రకు 585టిఎంసీలు, మధ్యన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి 734టిఎంసీలు, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811టిఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారమే కృష్ణానది జలాల్లో వాటాలమేరకు భాగస్వామ్య రాష్ట్రాలు ఉపయోంచుకోవాల్సివుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు ఏవిధమైన మార్పులు చేయకుండా ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 65శాతం నీటిలభ్యత అధారంగా కృష్ణానదిలో 2578టిఎంసీల నీటిని నిర్ధారించింది. అందులో అదనంగా లభ్యత ఉందని లెక్కగట్టిన నీటితో కలిపి మహారాష్ట్రకు 666టిఎంసీలు , కర్ణాటకకు 907టిఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 1005టిఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్పు నిచ్చింది. అయితే ఈ తీర్పుపైదిగువ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటం, న్యాయం జరపాలని సుప్రీకోర్టును ఆశ్రయిటంతో సుప్రీంకోర్టు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకుండా నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వం బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా నిలిపివేసింది.

ఒక పక్క బచావత్ నీటి కేటాయింపుల కంటే అధికంగానే అక్రమ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున కర్ణాటక ప్రభుత్వం బ్రజేష్ ట్రిబ్యునల్ ద్వారా లబించే నీటిలో తాత్కాలికంగా కేటాయింపులు జరపాలని ఇటీవల సుప్రీంకోర్టును కోరింది. దీనిపై దిగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభ్యంతరాలు తెలిపింది. ఇప్పటికే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని , కర్ణాటక కోరిక మేరకు బ్రజేష్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునేందు కర్ణాటకు అనుమతి ఇస్తే దిగువ రాష్ట్రంగా తాము మరింత నష్టపోతామని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విన్నవించింది. సుప్రీంలో భాగస్వామ్య రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణానదిపై 519మీటర్ల స్థాయితో ప్రతిపాదించిన అల్మట్టి ప్రాజెక్టును కర్ణాటక గుట్టు చప్పుడు కాకుండా 524మీటర్ల స్థాయికి పెంచుకుంది. దిగువ రాష్టాలు ఈ అక్రమ నిర్మాణాన్ని గుర్తించి కేంద్ర జలసంఘానికి , సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయటంతో అల్మట్టి గేట్లు ఎత్తు పెంచకుండా నిలిపివేశారు.

గేట్ల నిర్మాణం, అదనపు ఎత్తు పెంపు ద్వారా ఇప్పుడు ఉన్న 129టిఎంసీల నీటినిలువ సామర్ధం 200టిఎంసీలకు పెరగనుంది. ఆల్మట్టిలో అదనంగా నీటి నిలువ పెంచటం కోసం అవసరమయ్యే భూసేకరణ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఇక కృష్ణానదీజలాలు అల్మట్టి వద్దనే ఆగస్ట్ చివరిదాకే ఆగిపోయే పరిస్థితి ఏర్పడనుంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లితే తప్ప దిగువకు చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి వుండదంటున్నారు. ఇప్పటికే తుంగ, బధ్ర , ఘట ప్రభ, మలప్రభ నదులపై రోడ్ కం బ్యారేజిల పేరుతో లెక్కలేన్ని ఎత్తిపోతల పథకాలను అక్రమంగా ఏర్పాటు చేసుకుంది.
తుంగభద్రపై 30టిఎంసీలతో మరో రిజర్వాయర్ !
తుంగభద్రపై మరో సమాంతర జలాశయం నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించినడిపిఆర్ కూడా సిద్దం చేసింది. గుట్టుగా సాగుతున్న సమాంతర జలాశయ నిర్మాణ ప్రతిపాదనను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీయే బయటపెట్టింది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తుంగభద్రకు సమాంతరంగా 30టిఎంసీల నీటి నిలువ సామర్ధంతో జలాశయాన్ని నిర్మిస్తామని హామీలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీటి పారుదల రంగానికి రూ.1.50లక్షల కోట్లు కేటాయిస్తామని అందులో మొదటి ప్రాధాన్యతగా తుంగభద్ర సమాంతర జలాశయం నిర్మిస్తామని ఆ రా్రష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామప్ప ప్రకటించారు. అయితే జలాశయం నిర్మాణం అంత సులువు కాదని నీటిపారుదల రంగం నిపుణులు చెబుతున్నారు.

తుంగభద్ర ప్రాజెక్టులో ఇప్పటికే నీటినిలువ సామర్ధం వంద టీఎంసీల మేరకు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో కోల్పోయిన నీటినిలువ సామర్ధాన్ని తిరిగి పెంచుకునేందుకు తుంగభద్రపై సమాంతర జలాశయం అవసరం ఎంతో ఉందని అంగీకరిస్తూనే , కర్ణాటకలో ఏకపక్షంగా రిజర్వాయర్ నిర్మిస్తే దిగువన ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర , కర్ణాటక , తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్యన కృష్ణానదీ జలాల పంపిణీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటిపరిష్కారానికి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌లో ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏవిధమైన అనుమతులు కూడా లేని తుంగభద్ర సమాంతర జలాశయం నిర్మాణం అంశాన్ని కర్ణాటక కాంగ్రెస్ లేవనెత్తడం దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News