హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ “స్లమ్‌ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను” అని అన్నారు. . జలవిహార్, ఐమాక్స్ వంటివి చాలా ఉన్నాయని, పేదల ఇళ్లను కూల్చడం మాత్రం సరికాదని అన్నారు. మూసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందన్నారు. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్‌టిఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇళ్లకు రెడ్‌మార్క్ వేయడం కచ్చితంగా తొందరపాటు చర్యేనని వ్యాఖ్యానించారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిదని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని దానం నాగేందర్ అన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీ త్వరలో కనుమరుగు కాబోతోందని, అతి త్వరలో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎంఎల్‌ఎలు రెడీగా ఉన్నారని తెలిపారు. తాము పార్టీ మారడంపై పెట్టిన కేసును చూపెట్టి వారిని బిఆర్‌ఎస్ అధిష్ఠానం భయపెడుతోందని ఆరోపించారు. అందుకే వాళ్లు పార్టీ మారకుండా ఆగుతున్నారన్నారు. ఆలస్యమైనా కాంగ్రెస్‌లో వారి చేరిక ఖచ్చితంగా ఉంటుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.