‘ఓ తాత చెరువులోకి ఎట్లా పోవాలి…? అరే బిడ్డ అటు నుంచి ఎండ్ల బండ్లబాట, ఇటు నుంచి నక్ష బాట ఉందిగా, తిరిగి పోతే రైతు ఉపాధ్యాయుల ను తయారు చేసే వ్యవసాయ కశాళాలలో నుం చి కూడా పోవచ్చూ కదా”. ఈ విధంగా గతం లో ప్రేమావతిపేట్ పెద్ద చెరువుకు దారి చూపే వారు నాటి స్థానిక పెద్దలు. ఇప్పుడేమో ఆ చె రువు ఉందా.. ఉంటే ఆ చెరువుకు దారేది అనే దుస్థితిని ది ప్రెస్టేజ్ నిర్మాణ సంస్థ తీసుకువచ్చిం ది. గత పాలకుల ఇష్టానుసార సిఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పథకం కింద చెరు వు అభివృద్ధి పేరిట కాలిబాట కూడా లేకుండా చేశారు.ఈ విషయమై గగన్‌పహాడ్ వాసులు మండల తహశీల్దార్ మొదలు జిల్లా కలెక్టర్ వర కు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. అయితే చెరువు నక్ష పూర్తిగా మార్చి వేసి సిఎస్‌ఆర్ కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టలను బఫర్ జోన్‌గా చూపుతున్న అ ధికారులు ఎఫ్‌టిఎల్‌కు పల్లంగా బఫర్ జోన్ ఉంటుంది కానీ, చెరువులో జలాలు అధికమైనప్పుడు నీరు గుట్టపై నుంచి పారుతాయా..? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రేమావతిపేట్ పెద్ద చెరువుకు దారెటు? అని అడగాల్సిన దుస్థితి స్థానికులకు పట్టింది. పుట్టి పెరిగిన ఊరిలో సరదాగా పెద్ద చెరువులో ఈత కొట్టిన రోజులు గుర్తు చేసుకుని అటుగా వెళ్లాలనిపించే వారికి ఆ చెరువుకు ఎలా వెళ్లాలో తెలియని తికమకపడుతున్నారు. అభివృద్ధి పేరిట చెరువును సిఎస్‌ఆర్ కింద తీసుకున్న ది ప్రెస్టేజ్ నిర్మాణ సంస్థ ప్రజల సొత్తు అయిన పెద్ద చెరువు జలవనరులను దర్జాగా కబ్జా చేసేసింది. జాతీయ రహదారి వైపు నుంచి భారీ ఆర్చీలు నిర్మించి గేట్లు పెట్టి సెక్యూరిటీని కాపలా కూడా పెట్టింది. దాంతో అటు చెరువులోకి వెళ్లాలంటే ది ప్రెస్టేజ్ సంస్థ జాగీరులోకి అనుమతి కోరిన విధంగా వారి దయాదాక్షిణ్యాలపై పరిస్థితి ఆధారపడిందని తెలుస్తోంది.
పెద్ద చెరువు రక్షణకై ప్రజల వైపు నిలబడుతున్న ‘మన తెలంగాణ’ ప్రేమావతిపేట్ పెద్ద చెరువు దాదాపు 50 ఎకరాలకు పైగా కబ్జా చెరలో ఉందన్న నగ్న సత్యాన్ని ‘మన తెలంగాణ’ ప్రత్యేక కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అధికారులు, ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం ఈ చెరువును కాలగర్భంలో కలపడానికి భారీ ప్లానే అమలు చేశారనేది అర్థం అవుతుందని స్థానికులు అంటున్నారు.
హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి నిలుచుంటే నిండు కండలా కనిపించే ప్రేమావతిపేట్ పెద్ద చెరువు పెద్ద ప్రమాదంలో ఉందని ‘మన తెలంగాణ’ హెచ్చరిస్తూనే ఉంది. ఈ చెరువు సర్వే నంబర్ 81 నుంచి సర్వే నంబర్ 89 వరకు మొత్తం 97.26 ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో ఉంది. జాతీయ రహదారికి అనుకుని మూతబడిన బీర్ల కంపెనీ స్థలాన్ని సుమారు 62 ఎకరాల వరకు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులు దానికి అనుకుని ఉన్న ఎఫ్‌టిఎల్‌లో ఉన్న ఒక నాటి యాసిడ్ కంపెనీ, సారో రబ్బర్ పరిశ్రమల షెడ్లను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పటికే ఎఫ్‌టిఎల్‌లో నిర్మాణాలతో కూడిన కంపెనీలను నిర్వహించిన రబ్బర్, యాసిడ్ పరిశ్రమల నిర్వాహకులు ఏనాటికైనా కూల్చివేతలు తప్పవనే నిర్ణయానికి వచ్చిన బీర్ల కంపెనీ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నా ది ప్రెస్టేజ్ కంపనీకి ఒప్పందాల ప్రకారం అప్పగించారని విశ్వసనీయ సమాచారం. దాంతో సదరు నిర్మాణ సంస్థ ఆ భూమిని కూడా
పట్టా భూమిగా చూపుతూ నిర్మాణంలో భాగంగా తవ్వకాల్లో వెలువడుతున్న మట్టిని భారీ కుప్పలుగా పోసింది. దాంతో అటు వైపుగా చెరువులోకి వెళ్లె మార్గం పూర్తిగా మట్టికుప్పలు కనుమరుగు చేశాయి. ఇక మరో వైపు బయోడైవర్సిటీ పార్కు గుట్టలు ఉన్నాయి. వ్యవసాయ కళాశాల నుంచి మేనేజ్ సంస్థకు వెళ్లె మార్గంలో ఆ సంస్థ గేటు ప్రక్క నుంచి బయోడైవర్సిటీ పార్కుకు రహదారి ఉంటుంది. కానీ, అధికారులు బయోడైవర్సిటీ పార్కు చుట్టు ప్రహారీ నిర్మించి గేటు ఏర్పాటు చేశారు. దాంతో ఆ మార్గం గుండా చెరువులోకి వెళ్లాల్సిన ప్రేమావతిపేట్ గ్రామ ప్రజలకు కనీసం కాలినడక దారి కూడా లేకుండా పోయింది. మరో విషయం ఏమిటంటే బయోడైవర్సిటీ పార్కు అభివృద్ధితో నిజారణ్యంగా ఆప్రాంతం మారడంతో కొన్ని రకాల వన్యప్రాణులు అక్కడ జీవనం సాగిస్తున్నాయి.
చెరువు ‘నక్ష’నే రికార్డుల్లో మార్చేసారు : ఎన్.ధనంజయ్
గగన్‌పహాడ్‌లోని ప్రేమావతిపేట్ పెద్ద చెరువు 98 ఎకరాలు ఉండగా, అందులో సగం మేర కబ్జా అయిందని గగన్‌పహాడ్ నివాసి, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. ధనంజయ్ ఆరోపించారు. చెవురు కబ్జా విషయమై స్థానిక అధికార పార్టీ నాయకుడిగా మీరు ఎందుకు స్పందించడంలేదని ‘మన తెలంగాణ’ ప్రశ్నించగా దాదాపు ఏడాది కాలంగా తాను అధికారులతో చేస్తున్న పోరాటాన్ని వెల్లడించారు. ది ప్రెస్టేజ్ సంస్థకు గత పాలకులు చెరువును అభివృద్ధి పేరిట కట్టబెట్టడాన్ని తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నానన్నారు. ఇక్కడ మరో రహస్యం ఏమిటంటే చెరువు ఎగువ ప్రాంతంలో ఉన్నగుట్టలను బఫర్‌జోన్‌గా చూపుతు కొత్త ప్లాన్ ( నక్ష) తయారు చేసి రికార్డుల్లో అధికారులు పొంద పరిచారని ఆయన ఆరోపించారు. చెరువు కబ్జా విషయమై రాజేంద్రనగర్ మండల తహశీల్దార్‌కు విన్నవించినా, వినతిపత్రాలు సమర్పించినా తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు. దాంతో జిల్లా కలెక్టర్‌ను కలసి లిఖితపూర్వకంగా సదరు సంస్థ పై ఫిర్యాదు, చెరువు పరరిక్షణకు వినతి చేయడం జరిగిందన్నారు. అయినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టం కింద చెరువు కేటాయింపులు జరిగిన అంశాలతో పాటు పాత రికార్డులను తెలపాలని జిల్లా కలెక్టర్‌కు అర్జి పెట్టుకుని 7 నెలలు గడిచినా నేటికి కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.
చెరువులోకి వెళ్లేందుకు అసలు దారి లేదు : సరికొండ వెంకటేష్
అప్పా చెరువును నుంచి వెళ్లే నీరు ప్రేమావతిపేట్ పెద్ద చెరువుకు చేరుకుంటుందని స్థానికుడు, మాజీ బిఆర్‌ఎస్ పార్టీ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు , ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు సరికొండ వెంకటేష్ తెలిపారు. గగన్‌పహాడ్ బస్తీకి అనుకుని ఉండే ప్రేమావతిపేట్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో ది ప్రెస్టేజ్ సిటీ పేరిట నిర్మాణ రంగ సంస్థ విలాసవంతమైన విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మిస్తుందని , వారికి అనుకూలంగా చెరువులోకి వెళ్లే దారి లేకుండా చేశారని ఆరోపించారు. మా ఊరి చెరువుకు వెళ్లేందుకు మాకు దారిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని, సిఎస్‌ఆర్ కింద అభివృద్ధి చేసే సంస్థలకే చెరువులపై పూర్తి హక్కు రాసిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి హైడ్రాను రంగంలోకి దింపితే కానీ పెద్ద చెరువు ప్రజలకు దక్కుదుందన్నారు.
ప్రకృతి ప్రసాధించిన జలవనరులు నాశనం చేస్తే ఏలా : ఎస్సీసెల్
ప్రకృతి ప్రసాదించిన చెరువులు, కుంటల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకునేది పోయి, అభివృద్ధి పేరిట నిర్మాణ సంస్థలకు అప్పగించడం, చారిత్రక జలవనరులను ప్రజలకు దూరం చేయడంమే అని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జల్‌పల్లి నరేందర్ వాపోయారు. హైడ్రా గగన్‌పహాడ్‌లో చేపట్టిన కూల్చివేతల చర్యలు అమోగమని, ప్రకృతి ప్రసాధించిన జల వనరులను భక్షిస్తున్న నిర్మాణ సంస్థల భరతం తప్పక పట్టాలని ఆయన అధికారులను కోరుతున్నారు.