Monday, December 23, 2024

ఆ నాలుగు యాప్‌లతో డేంజర్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజు రోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయా బ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను ఈ నాలుగు వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఎనీడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌ల ద్వారా సైబర్ నేరస్థులు డబ్బులు కొట్టేస్తున్నారని ఎస్‌బిఐ హెచ్చరించింది. తమ బ్యాంక్ ఖాతాదారులు వెంటనే వాటిని మొబైల్ ఫోన్ నుంచి డిలిట్ చేయాలని సూచించింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నుంచి సైబర్ నేరాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సైబర్ నేరస్థులు బాధితులకు మాయమాటలు చెప్పి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న 150మంది బ్యాంక్ ఖాతాదారులు నాలుగు నెలల్లో రూ.70లక్షలకు పైగా పోగొట్టుకున్నారు.

దీంతో బ్యాంక్ వెంటనే అప్రమత్తమై తన ఖాతాదారులను హెచ్చరించింది. చాలామంది బ్యాంక్ ఖాతాదారులను మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని చెప్పి మాయమాటలు చెబుతున్నారు. దానికి మీకు మేము లింక్ పంపిస్తామని దానిని క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే మళ్లీ యాక్టివ్ అవుతుందని చెబుతున్నారు. ఇది నమ్మిన బాధితులు వారు చెప్పినట్లు చేయడంతో బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాగే సిమ్ బ్లాక్ అయిందని ఓ వృద్ధుడికి ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.60,000 కొట్టేశారు. రెండు రోజుల్లో మీ సీమ్ బ్లాక్ అవుతుందని సైబర్ నేరస్థులు చెప్పడంతో ఆందోళన చెందిన వృద్ధుడు వారు చెప్పినట్లు చేశాడు. వారు పంపించిన లింక్‌ను ఓపెన్ చేసి వారు చేయమన్నట్లు చేయడంతో సైబర్ నేరస్థులు బ్యాంక్ ఖాతాలోని డబ్బులు కొట్టేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా చాలామంది అమాయకులు సైబర్ నేరస్థులు బారినపడుతున్నారు. ఈ నాలుగు యాప్‌ల ద్వారా మనకు సంబంధించిన మొత్తం డాటా సైబర్ నేరస్థుల చేతికి వెళ్లడంతో వారు బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను దోచుకుంటున్నారు.

క్యూఆర్ కోడ్‌తో జాగ్రత్త….
ఈ మధ్య క్యూఆర్ కోడ్‌తో సైబర్ నేరస్థులు స్కాన్ చేయించి డబ్బులు బ్యాంక్ ఖాతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. తాము క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నామని దానిని స్కాన్ చేసి రూ.1 పంపిస్తే చాలు మిగతాది తాము చూసుకుంటామని చెబుతున్నారు. ఇలా స్కాన్ చేయడం వల్ల చాలామంది బ్యాంక్ ఖాతాలోని డబ్బులు దోచుకుంటున్నారు. యూపిఐ యాప్‌లను వాడే వారు ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్యూఆర్ కోడ్ వల్ల బ్యాంక్ ఖాతా వినియోగదారుడి మొత్తం వివరాలు సైబర్ నేరస్థుల చేతుల్లోకి వెళ్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
నకిలీ కస్టమర్ కేర్…
తన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు పోయాయని ఖాతాదారులు గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతుకుతున్నారు. దానిని కూడా సైబర్ నేరస్థులు వదలడంలేదు, గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్ పెట్టి దానికి బాధితులు ఫోన్ చేయగానే తమ గేమ్ ప్లాన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఫోన్ చేయగా డబ్బులు పోగొట్టుకున్న వారి వివరాలు అడిగి తర్వాత బాధితుల బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మొత్తం దోచుకుంటున్నారు. దీంతో బాధితుల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News