Sunday, December 22, 2024

కాంగ్రెస్ తో డేంజర్

- Advertisement -
- Advertisement -

హస్తం వస్తే రైతులు, భూములకు రక్షణ ఉండదు

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : దేవాదుల ప్రాజెక్టు నీటిని వరంగల్ జిల్లాకే అంకితం చేశామని, మల్లన్నసాగర్, తపాస్‌పల్లి రిజర్వాయర్లను కాళేశ్వరానికి లింక్ చేసి జనగామ జిల్లాలో నూటికి నూరు శాతం రైతులకు సాగునీటిని అందిస్తామని, దేశంలో ఎక్కడా కరువొచ్చినా జనగామ జిల్లాకు మాత్రం కరువు రాదని ముఖ్యమంత్రి కల్వకుం ట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రా మీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షత నిర్వహించిన జనగామ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఒకప్పుడు జనగామ జిల్లాను యాది చేసుకొంటే కళ్లల్లో నీళ్లువచ్చేవని, ఇప్పుడు వలసలు ఆగిపోయి, పంటలు సమృద్ధిగా పండి అభివృ ద్ధి పథంలో దూసుకపోతుందన్నారు. ఆనాటి తాగునీటి గోస, కరెంటు కష్టాలు తలుచుకుంటే దుఃఖం కలిగేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటు అందించేది ఒక్క తె లంగాణ రాష్ట్రమేనని అన్నారు. ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. వేల సంఖ్యలో లారీల్లో ధా న్యం తరలిస్తున్నా నెలల తరబడి ధాన్యం కొనుగోళ్లు చేయాల్సి వస్తుందని, అంత సమృద్ధిగా పంటలు పండుతున్నాయన్నారు.

తెలంగాణలో రైతుల వ్యవస్థీకరణ జరిగేందుకు తామెంతో కృషిచేస్తున్నామని తెలిపారు. తాను కూడా కాపోడినేనని, అందుకే రైతుల కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ధరణి ఒక అద్భుతమైన కార్యక్రమమని, ధరణి వల్ల రైతులకు తమ భూములపై సర్వ హక్కులు కలిగాయని, ఒకవేళ బిఆర్‌ఎస్ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తామని చెబుతున్నారని, అప్పుడు వీఆర్‌వో, తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు లంచాలు మళ్లీ కథ మొదటికి వస్తుందన్నారు. ధరణిని తొలగిస్తామన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పారేయాలన్నారు. తమ మేనిఫెస్టోలోని పథకాలను వివరించారు. అదేవిధంగా ఆసరా, వికలాంగుల పింఛన్లను క్రమంగా పెంచుతామన్నారు. ఇప్పటికే 93 లక్షల కుటుంబాలకు రైతుబీమా వర్తిసున్నదని, మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తెల్లరేషన్ కార్డు కుటంబాల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటు వజ్రాయుధమని, ఆలోచించి వేయాలన్నారు. ఏమరుపాటుతో వేరే పార్టీలకు ఓటు వేస్తే సమస్యలు వస్తాయని, అప్పుడు తాను కూడా ఏమీచేయలేనని తెలిపారు. ఈ పదేళ్లలో ఎలాంటి మతకలహాలు లేవని, అంతే సామరస్యతతో ఉండాలంటే బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

బిసిలకు ఇచ్చే లక్షల రూపాయలు ఆర్థికసాయం అందరికీ అందుతాయని, అదేవిధంగా దళితుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని, తన ప్రాణం ఉన్నంత వరకు దళితబంధు కొనసాగుతుందన్నారు. జనగామ నియోజకవర్గ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని సూచించారు. అంతకుముందు బిఆర్‌ఎస్ జనగామ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ ప్రాంత ఉద్యమాల గడ్డ, అన్ని ఉద్యమాల్లో కెసిఆర్ వెంట ఉన్నారని, అలాంటి జనగామ ప్రాంతానికి సిఎం కెసిఆర్ సాగునీరు, మెడికల్ కాలేజీ ఇచ్చారని, సాగునీటిని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, బొమ్మకూరు ద్వారా ఇస్తున్నారని, ఇంకా ఎక్కడెక్కడ పంట కాల్వలు అవసరమున్నవో అక్కడ పంటలకాల్వలు, చెక్‌డ్యామ్, మినీ లిఫ్ట్‌లు ఇవ్వాలని, అదేవిధంగా జనగామకు మెడికల్ కాలేజీతో నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కోర్సెస్ కాలేజీ, పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీ ఇవ్వాలని కోరారు. అండర్ డ్రెయినేజీ, రంగప్ప చెరువు అభివృద్ధి, ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్, డిసిపి ఆఫీస్, స్పోర్ట్ స్టేడియం, కళాభవనం కావాలి, చేర్యాలలో అగ్రికల్చర్ పనులకు గజ్వేల్‌కు, రెవెన్యూ పనులుంటే సిద్దిపేటకు, ఎలక్ట్రిసిటీ పనులు ఉంటే హుస్నాబాద్‌కు వెళుతున్నారని, చిన్న యూనిట్ అయినా నాలుగు మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, ఈ నాలుగింటిని కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. అదేవిధంగా బచ్చన్నపేటలో, చేర్యాలలో నర్మెటలో జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. జనగామలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పల్లాను గెలిపించిన నెల రోజుల్లోనే చేర్యాలను డివిజన్‌గా చేస్తానని తెలిపారు. జనగామలో తాగునీళ్లు సరఫరా చేస్తున్నా అవి మంచినీళ్లుగా భావించి ప్రజలు తాగడం లేదని, గెలిచిన వెంటనే వాటిని శుభ్రపర్చేందుకు కావాల్సిన నిధులు తీసుకొని మొట్టమొదటి ఎజెండా తాగునీటిని అందిస్తానని తెలిపారు. అదేవిధంగా చేర్యాల ఫైర్ స్టేషన్, మినీస్టేడియం తదితర సమస్యలను ప్రస్తావించగా కెసిఆర్ వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. మీరు తనను ఈ ప్రాంతానికి పంపారంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఉంటుందని, దానిని నిజం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కెసిఆర్ మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ఇంట్లో మనిషి వంటివాడని, పార్టీ ప్రధాన కార్యదర్శి అని, జనగామ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా కృషిచేస్తాడని తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు జనగామ జిల్లాపై ప్రేమ ఎక్కువ అని, ఇక్కడి మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందరం సమష్టిగా కృషిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇస్తామని తెలిపారు. ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఆయన దేశాధినేతగా వర్ధిల్లుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కెసిఆర్ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తారని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతున్నారని అన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్‌లో ఉన్నా తనకు అవమానాలే ఎదురయ్యాయని, ఇకపై బిఆర్‌ఎస్ చేసే అభివృద్ధిలో తాను భాగస్వామిని అవుతానని తెలిపారు. ఈ బహిరంగ సభలో జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎ డా. టి.రాజయ్య, ఎంఎల్‌సిలు మధుసూదనాచారి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ జమున, మాజీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News