Monday, January 20, 2025

చిరుతిళ్లతో చేటు

- Advertisement -
- Advertisement -

నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే మెదడు, అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి. మనం తినే ఆహార పదార్థాలు మెదడు నిర్మాణం, పని తీరు, మానసిక స్థితిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా కలిగిన (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్)ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు తదితర ముప్పు తప్పదని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అసమతుల్య, అనారోగ్యకరమైన ఆహారం కారణంగానే 2018లో ప్రపంచం మొత్తం మీద అకారణంగా 12 మిలియన్‌మంది ప్రాణాలు కోల్పోయినట్టు 2021లో గ్లోబల్ న్యూట్రిషన్ నివేదిక వెల్లడించింది. 2019 నాటి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం శరీరం అత్యధికంగా బరువెక్కడం, ఊబకాయం ముఖ్యంగా సంపన్న దేశాల ప్రధాన సమస్య అన్నఅభిప్రాయానికి భిన్నంగా స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోని ప్రజల్లో కూడా 70% మందిలో ఈ అనారోగ్యకర పరిస్థితి కనిపిస్తోందని వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోనూ 55% ఇది ఎక్కువగా కనిపిస్తోంది. భారత దేశంలో సాంక్రమణేతర వ్యాధుల భారం విపరీతంగా పెరుగుతోంది.

ఈ పరిస్థితి 1990లో 38% ఉండగా, 2019లో 65 శాతానికి పెరిగింది. ప్రపంచం మొత్తం మీద ఈ వ్యాధుల భారం అధ్యయనం చేయగా, భారత్‌లో ఏటా 1.2 మిలియన్ మరణాలు కేవలం అనారోగ్య ఆహారం వల్లనే సంభవిస్తున్నాయని తేలింది.అమాంతంగా శరీరం బరువు పెరగడం, ఊబకాయం తాలూకు ప్రభావం 2017లో భారత్‌లో ఆర్థిక పరిస్థితిపై చూపించి 23 బిలియన్ డాలర్ల వరకు నష్టానికి దారితీసిందని, ఈ సమస్యను పరిష్కరించలేకుంటే 2060 నాటికి 480 బిలియన్ డాలర్ల వరకు చేరే ప్రమాదం ఉంటుందని అంచనాగా తేలింది.భారత్‌లో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార రంగం వార్షిక వృద్ధిరేటు 2011 నుంచి 2021 మధ్య కాలంలో 13.4% వరకు పెరిగింది. ప్రపంచం మొత్తం మీద 2022లో భారీ చక్కెర ఉత్పత్తిదారు, వినియోగదారు భారతే అని తేలింది. కొవ్వు, చక్కెర, ఉప్పు అత్యధికంగా కలిగిన అల్ట్రా ప్రాసెస్‌డ్ ఆహార పదార్థాలు (హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్) వినియోగించే దేశం భారత్ అని ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ రూపంలో వినియోగమవుతున్న ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారపదార్థాలను ఒక విధంగా ‘చిరుతిళ్లు ’అని చెప్పవచ్చు.

చెప్పుకోడానికి ఇవి చిరుతిళ్లు అయినా వీటివల్ల ఆరోగ్యానికి వచ్చే హాని మాత్రం ఎక్కువే. తినదగిన (ఖాద్య) చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు 50 నుంచి 60 శాతం వరకు ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమలోనే వినియోగమవుతున్నాయి. గత దశాబ్దకాలంలో స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. గత ఏడాది 30 బిలియన్ డాలర్ల వరకు ఈ అమ్మకాలు అధిగమించాయి. ఇది ఆహారపు అలవాట్లలో అలజడి కలిగించే పరిణామం అని చెప్పవచ్చు. ఇది కేవలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఉత్పాదకపైన, ఆర్థిక అభివృద్ధిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ ఉత్పత్తుల వినియోగాన్ని అత్యవసరంగా నిరోధించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఊబకాయాన్ని నివారించడానికి ప్రపంచం మొత్తం మీద ఆర్థిక చర్యలు చేపట్టే ధోరణి కనిపిస్తోంది.ఈ ఉత్పత్తుల వినియోగాన్ని బాగా తగ్గించడానికి అధికంగా పన్నులు విధించడం సమర్ధవంతమైన చర్యగా యోచిస్తున్నారు. తియ్యని చక్కెర పానీయాలపై పన్ను చాలా విస్తృతమైనప్పటికీ 60కు పైగా దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి.

ప్రాసెస్ అయిన ఆహార ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతున్నా, వాటిపై పన్ను సాధారణంగానే ఉంటోంది. డెన్మార్క్, ఫ్రాన్స్, హంగేరీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, తదితర 16 దేశాలు ఈ ఉత్పత్తులపై పన్ను అధికంగా విధిస్తున్నాయి. ఇటీవలనే కొలంబియాలో ‘జంక్‌ఫుడ్ లా’ అమలులోకి తెచ్చారు. వీటిపై క్రమంగా లెవీ పెంచుతున్నారు. భారత్‌లో కేరళ రాష్ట్రం 2016 లోనే ‘ఫ్యాట్ టాక్స్’ను అమలులోకి తెచ్చినప్పటికీ, తరువాత 2017లో దీన్ని ఇండియా గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి)లో ఉపసంహరించుకున్నారు. ఈ ఉత్పత్తులపై పన్ను విధింపులో వైఫల్యాలు అనేక ప్రతికూల అంశాలకు దారి తీస్తున్నాయి. ఈ పదార్థాల అత్యధిక వినియోగంతో ఆరోగ్య భద్రత వ్యయం పెరుగుతోంది. ఫలితంగా పెరిగిన పన్నుల భారాన్ని భరించవలసి వస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలకు విపరీతంగా ఖర్చు పెట్టవలసివస్తోంది. ఇక అంతర్గత ప్రభావాలను పరిశీలిస్తే వీటి మార్కెట్ దూకుడు ప్రభావం వినియోగదారులకు హాని కలిగిస్తోంది.

హానికరమైన వినియోగ అలవాట్లను అరికట్టాలంటే ఆయా ఉత్పత్తులపై పన్నులను పెంచడమే సరైన పరిష్కారం అని చెబుతున్నారు. అటువంటి అత్యధిక పన్నుల విధింపుతో వివిధ దేశాల్లో సతలితాలు కనిపించాయి. అనారోగ్యకరమైన వస్తువుల కొనుగోలు తగ్గింది.పొగాకు, ఆల్కహాల్ వంటి వస్తువులపై విధించే పన్ను మాదిరిగా కాకుండా హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ పదార్ధాలపై పన్ను విధింపు కేవలం రెవెన్యూ పెంచడానికే అనే దృష్టితో చూడవలసిన అవసరం లేదు. ఈ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మరింత ఉత్పత్తి చేయడానికి ఆ పరిశ్రమను ప్రోత్సహించడానికి తగిన ఆర్థిక ప్రోత్సాహంగా పరిగణించాలి. ఈ విధానాలను సరిగ్గా నిర్వహిస్తే హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఉత్పత్తులపై ఆహార పన్ను సజావుగా నిర్వహించవచ్చు. దక్షిణాఫ్రికా ఆరోగ్య ప్రమోషన్ లెవీ అధ్యయనంలో పన్ను విధించిన పానీయాల కొనుగోలు బాగా తగ్గినట్టు బయటపడింది. అయితే అల్ట్రా ప్రాసెస్‌డ్ ఆహార పదార్థాలపై ప్రస్తుతం ఉన్న జిఎస్‌టి రేట్లు పోషకాహార నాణ్యతను బట్టి విధించినట్టు కనిపించడం లేదు.

ఉదాహరణకు షుగర్ స్వీటెస్ట్ బెవరేజెస్(ఎస్‌ఎస్‌బి)అంటే చక్కెర కూడిన తియ్యని పానీయాలపై పన్ను జిఎస్‌టి 28% రేటు, 12% కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. అయితే పదార్ధంలో వుంటే చక్కెర శాతాన్ని విస్మరిస్తున్నారు.ఇక ఎయిరేటెడ్ పానీయాల్లో అంటే గాలితో కూడిన పానీయాల్లో ఒకే పన్ను విధిస్తున్నారు. జ్యూస్‌ల్లో 12% జిఎస్‌టి రేటు విధిస్తున్నారు. ఇందులో ఏయే పండ్లు వాడుతున్నారో, ఎంత చక్కెర శాతం ఉందో పట్టించుకోవడం లేదు. సాల్టీ స్నాక్స్‌లో ఉప్పు శాతం ఏమాత్రం ఉందో పరిశీలించకుండా 12% జిఎస్‌టి రేటు మాత్రం విధిస్తున్నారు. ఇటువంటి అసమానతల వల్ల వివిధ పోషకాహార విలువల ప్రభావాన్ని పరిగణన తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది. అందువల్ల ప్రత్యామ్నాయ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం కనిపించడం లేదు.

హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ (అల్ట్రా ప్రాసెస్‌డ్) ఉత్పత్తులపై పన్ను విధింపు కేవలం ఆర్థిక నష్ట లాభాల ప్రాతిపదికగా చూడకూడదు. అలాంటి పన్నులు హెచ్‌ఎఫ్‌ఎస్‌ఎస్ ఉత్పత్తుల వినియోగానికి నిరోధకంగా పని చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయి. ఆహార ఉత్పత్తుల తయారీ విధానంలో సంస్కరణకు పురిగొల్పుతాయి. ప్రజారోగ్య ఉత్పత్తుల అభివృద్ధికి వీలు కల్పిస్తాయి. ఆరోగ్యభద్రత వ్యవస్థపై భారం తగ్గిస్తాయి. దేశ శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆహార ఉత్పత్తులకు ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజీ లేబిల్స్ (ఎఫ్‌ఒపిఎఎల్) తప్పనిసరిగా వర్తింప చేస్తే ప్రజారోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయా ఉత్పత్తుల్లో పోషక విలువలు ఏ స్థాయిలో ఎంత ప్రమాణంలో ఉన్నాయో వినియోగదారులకు తెలియడం లేదు. అందువల్ల ఈ ప్రమాణాలు వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా ప్యాకేజీలపై లేబిళ్లు ముద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News