Monday, January 20, 2025

డిఎఒ పేపరూ లీక్!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా పత్రం కూడా లీకైనట్లు అధికారులు నిర్ధారించారు. ప్రవీ ణ్ నుంచి పేపర్ కొన్న సాయి లౌకిక్, సాయి సుస్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు సుస్మిత కోసం ప్రవీణ్ వద్ద నుంచి లౌకిక్ డిఎవొ పేపర్ కొన్నాడు. ఇందు కోసం ప్రవీణ్‌కు రూ.6 లక్షలు లౌకిక్ ముట్టజెప్పాడు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా ప్రవీ ణ్ ఖాతాలో ఉన్న రూ.6 లక్షలపై అనుమానం రా వడంతో విషయం వెలుగుచూసింది. దీంతో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలకు సంబంధించి డిఎవొ పేపర్ కూడా లీకైనట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో ప్రవీ ణ్ ఎంతమందికి ఈ పేపర్ అమ్మాడో తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. మరోవైపు డిఎవొ పరీక్ష రాసిన అభ్యర్ధులు ఆందోళనకు గురవుతున్నారు. అటు తాజా అరెస్ట్‌లతో కలిపి టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కి చేరుకుంది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌పై టెక్నికల్ సాక్ష్యాల కోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్ విశ్లేషణ చేయించారు.

ఆ నివేదిక కూడా పోలీసులకు అందింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్ తో విశ్లేషణ చేయించారు. టిఎస్‌పిఎస్‌సి ఆఫీసులోని ప్రవీణ్, రాజశేఖర్ లాప్‌టాప్, సిస్టమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ నివేదిక రావడంతో 90 శాతం విచారణను సిట్ పూర్తి చేసినట్లయింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును కోర్టుకు సిట్ అందించనుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. 150 మందికి పైగా వ్యక్తులను సిట్ ఇప్పటివరకు విచారించింది. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మెన్, సెక్రెటరీ, మెంబర్, 15 మంది నిందితులు, గ్రూప్-1 అభ్యర్థులను సిట్ విచారించింది. ఈ నెల 11న హై కోర్టుకు సిట్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించనుంది. ఒకరి ద్వారా మరొకరికి పేపర్ చేరింది. ప్రవీణ్, రాజశేఖర్ నుంచి రూ.15 లక్షలకు పేపర్ తీసుకున్న నిందితులు మరికొంతమందికి విక్రయించారు.

పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఇలా ఎప్పటినుంచి పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇలా ఇంకా ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనేది ఆందోళనకరంగా మారింది. అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు లీక్ చేసినట్లు గుర్తించారు. మరోవైపు పేపర్ లీక్ కేసుపై ఇడి కూడా రంగంలోకి దిగింది. ఇడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నిందితుల మధ్య లావాదేవీల విషయంపై ఆరా తీస్తోంది. నగదు లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో నిందితుల మధ్య లావాదేవీలు ఎలా జరిగాయనే దానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ కేసును త్వరగా చేధించి వెంటనే కొత్త పరీక్షల తేదీలను ప్రకటించాలని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎవరో కొంత మంది చేసిన తప్పునకు లక్షల మంది విద్యార్థులు మానసిక వేదన అనుభవించాల్సి వస్తోందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News