పచ్చదనం కోసం… పచ్చని లోకం కోసం పరితపించి.. మొక్కలే ప్రాణవాయువుగా జీవించిన వనజీవి, పద్మశ్రీ డాక్టర్ దరపల్లి రామయ్య అనంత అయువులో కలిసిపోయారు. మొక్కలులేకుంటే మానవుడి మనుగడే ఉండదని గత ఏడు దశబ్దాలుగా పోరాడి తెలుగు నేలపై మూడు కోట్లకు పైగా మొక్కలను నాటిన ప్రకృతి ప్రేమికుడు పుడమి తల్లి వడిలోకి చేరుకున్నారు. మొక్కలు నాటడమే తన జీవితాశయంగా మార్చుకున్న ‘నిలువెత్తు లాంటి పచ్చని చెట్టు’ ప్రాణం విడవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన నాటిన ముక్కోటి వృక్షాలు విలపిస్తున్నాయి. మొక్కలన్నీ కన్నీటి బొట్లను కార్చుతున్నాయి. నాటినవిత్తనాలను విచారం వ్యక్తం చేస్తున్నాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే నినాదాన్ని తన శరీరంలో అంతర్ భాగంగా చేసుకున్న హరిత ప్రేమికుడు పద్మశ్రీ దరిపల్లి రామయ్య (86) శనివారం తెల్లవారుజామున ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిగూడెంలోని తన నివాస గృహంలో గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసి ప్రకృతి విలవిల్లాడింది.
నాటిన ప్రతి మొక్క, పెంచిన ప్రతిచెట్టు, కదిలే కొమ్మ, వీచే గాలి, పూచే పూలు, ఆకలి తీర్చే ఫలాలు ఆయన లేరని తెలిసి దుఃఖిస్తున్నాయి.మొక్కలే ప్రాణంగా, పర్యావరణమే ఊపిరిగా చివరి వరకు జీవించిన వనజీవి రామయ్య బాల్యదశలో తల్లిచూపిన మార్గంలో, గురువులు నేర్పిన చదువుతో ఆయన పర్యావరణంపై ప్రేమను పెంచుకున్నారు. పొద్దున లేస్తే మొక్కలతోనే సహజీవనం చేసే ఆయనకు మొక్కలే హితులు, సన్నిహితులు. ప్రకృతితో మమేకంకావడం ఆయన స్వభావం. పచ్చని పుడమి ఆయన నిరంతర స్వప్నం. ఆకుపచ్చని లోకం ఆయన ఇష్టపడే ప్రపంచం. లక్షలాది వృక్షాలకు మిత్రుడు, కోటి మొక్కలకు కల్పతరువు. అతని చేతులే చెట్లై, ఆయన అడుగులే ఆకులై, రెండు చేతులనిండా విత్తనాలను వెదజల్లారు. అతను చిఫ్కో ఉద్యమకారుడు సుందర్ లాల్ బహుగుణ సహచరుడు కాకపోయినా ‘అభినవ అశోకుడి’గా మిగిలిపోయారు.
అతను పెద్దగా చదువుకోకపోయినా చెట్లు లేకపోతే కలిగే నష్టాలను బాల్యంలోనే తెలుసుకోని నాటి నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా విత్తనాలను నాటడం, మొక్కలను పెంచడం తన జీవితాశయంగా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలే శ్రీరామరక్షగా బలంగా నమ్మిన ఆయన వృక్ష యజ్ఞాన్ని ప్రారంభించారు. ముందు ఒంటరిగా ఈ యజ్ణంలో పాల్గొన్నప్పటికీ ఆ తరువాత ఆయన జీవిత సహచరి, కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములయ్యారు. ఖమ్మం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఖమ్మం రూరల్ మండలం, ముత్తగూడెం గ్రామంలో దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946, జులై 1వ తేదీన జన్మించిన దరపల్లి రామయ్యకు తన చిన్నతనంలో తల్లి బిరకాయ విత్తనాలను నాటుతుంటే చూసిన రామయ్య ఒక విత్తనం నాటితే దానికి అనేక బీరకాయలు కాసే అద్భుతాన్ని గమనించి బాల్యంలోనే మొక్కల పెంపకంపై మక్కువ పెంచుకున్నారు.
ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో 1960లో 5వ తరగతి వరకు చదువుతున్న సమయంలోనే జి మల్లేశం అనే టీచర్ మొక్కల పెంపకం వాటివల్ల కలిగే లాభాలపై చెప్పిన సైన్స్ పాఠమే అతణ్ణి వనజీవి రామయ్యగా ఎదిగేంతగా తీర్చిదిద్దింది. ఆనాడు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం తన మనసులో బలంగా నాటుకోవడంతో తన చేత దాదాపు మూడు కోట్లకుపైగా మొక్కలను నాటేటట్లు చేసింది. దీనికి తోడు కెన్యా దేశంలో వంగారిమాతై అనే మహిళ పదేళ్ల కాలంలో మూడు మిలియన్ల మొక్కలను నాటినట్లు అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలను చదవిని రామయ్య దానిని స్ఫూర్తిగా తీసుకొని తాను మరణించే నాటికి మూడు కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెటుకుని ఆనాటి నుంచి మొక్కల యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇందిరా గాంధీ హయాంలో విశాఖపట్టణంలో హెలికాప్టర్ల ద్వారా విత్తనాలను చల్లిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆ రోజునుంచే విత్తనాలను చల్లడం ప్రారంభించారు. రోడ్ల వెంట నీడను ఇచ్చేందుకు నిద్ర గన్నేరు విత్తనాలను చల్లడం ప్రారంభించారు.
స్వగ్రామంలో తన ఇంటినుంచి దాదాపు 8కి.మీ. వరకు రోడ్డకు ఇరువైపులా నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా బాటసారులకు నీడను ఇస్తున్నాయి. తనకు వారసత్వంగా తండ్రి ద్వారావచ్చిన ఏడెకరాల స్థలాన్ని అటవీ ప్రయోగశాలగా, నర్సరీగా తీర్చిదిద్దారు. 150 రకాల మొక్కలను నాటగా అవి ఏపుగా పెరిగి చిట్టడవిలాగా తయారయ్యాయి. ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డు వెంట ఉన్న చెట్లను నరికిన సమయంలోనే రామయ్య ప్రాణం సగం చచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. రెడ్డిపల్లి గ్రామంలో 30వేల మొక్కలతో నర్సరీని పెంచి వివిధ గ్రామాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉచితంగా మొక్కలను అందించారు. తెల్లవారుజామునే రోడ్లవెంట తిరుగుతూ విత్తనాలను చల్లుతూ ఖాళీ జాగా కన్పిస్తే చాలు మొక్కలను నాటుతుంటే ఆనాడు అందరూ అతనిని చూసి మొక్కల పిచ్చోడని అవమానించారు.
ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది హేళనచేసినా పట్టించుకోకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, కలలు కన్న ఆకుపచ్చని లోకం కోసం గడిచిన 70 ఏళ్ళనుంచి పరితపిస్తున్నారు. 80 ఏళ్ళ వృద్ధ్దాప్యంలో కూడా హరిత స్వప్నంకోసం తపించిపోయారు. వయస్సు సహకరించుకున్నా చిన్నమోపెడ్ ద్వారా గ్రామాల్లో తిరుగుతూ మొక్కలను నాటారు. గడిచిన ఏడు దశబ్దాల కాలంలో ఆయన 200 గ్రామాల్లో రెండు వేల ప్రాంతాల్లో మొక్కలను నాటారు. వెయ్యి పాఠశాలల్లో, 600 ప్రభుత్వ కార్యాలయాల్లో, 500 దేవాలయాల్లో మొక్కలను నాటారు. అడవుల్లో కోట్లాది విత్తనాలను సేసకరించి రాష్ట్రవ్యాప్తంగా వెదజల్లారు. ఆయన నాటిన చెట్లనుంచి కాయలను ఏరి వాటి నుంచి వచ్చే గింజలను సేకరించి వాటిని బీడుభూములే, ఖాళీ స్థలాల్లో, అడవుల్లో, కొండ కోనల్లో, గుట్టల్లో విత్తనాలుగా చల్లేవారు. చూపు ఆనకపోయినా, చెవులు వినిపించకపోయినా వెనుకడుగువేయకుండా మొన్నటివరకు కూడా ఆయన ‘మొక్క’వోని దీక్షతో మొక్కలనునాటారు.
నాటిన మొక్కలు భారీ వృక్షాలుగా మారిన కొన్ని లక్షల చెట్లకు ఆయనే కల్పతరువుగా మారారు. గడిచిన 70 ఏళ్ళుగా మొక్కలను నాటుతూ ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని హరిత విప్లవం సృష్టించారు. ఆయన ఇంటినే మొక్కల ప్రయోగశాలగా మార్చారు. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలను పెంచారు.పర్యావరణ పరిరక్షణపై ఆయన కొత్తగూడెం రేడియో కేంద్రంలో అనేకమార్లు తన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన కొన్ని వందల మొక్కలకు సంబంధించిన విశిష్టతలను, జాతీయ నామాలను ఒంటబట్టించుకున్నారు.జిల్లా కేంద్రంలో ప్రతి ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి శకటాల వెనుక తానే పర్యావరణ శకటంగా మారి నడిచేవారు. పర్యావరణ కమిటీ సభ్యుడిగా తన స్వంత ఖర్చులతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి మొక్కల పెంపకపై ప్రజలను చైతన్యపరిచేవారు.
నలుగురు గుమికూడిన చోటకు వెళ్ళి వారిని చెట్ల పెంపకంపై ప్రచారం చేసేవారు. దానికి ఆయన భారీ వ్యయం అయ్యే వస్తువులను వాడుకోలేదు. కేవలం పనికిరాని వస్తువులనే తన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. వాటి ద్వారానే మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై ఆయన విస్తృత ప్రచారం చేశారు. వ్రతం ఆకారంలో రేకుతో తయారు చేసిన దానిపై వృక్షో రక్షతి.. రక్షితః, వృక్షం శరణం గచ్ఛామి, రామకోటి.. వృక్ష కోటి లాంటి నినాదాలు స్వయంగా రాయడమే కాకుండా చెట్ల రక్షణపై 800కు పైగా సూక్తులను తయారు చేసి వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. గ్రానైట్ రాళ్ళపై మొక్కల బొమ్మలను, సూక్తులను చెక్కి జనసమర్ధన ప్రదేశాల్లో ఏర్పాటు చేసేవారు.
రోడ్లపై లభించే పనికిరాని అట్టముక్కలపై, ఇనుపరేకులపై తానే స్వయంగా రంగులతో మొక్కల పెంపకం సంబంధించిన సూక్తులను లిఖింపజేసి ప్రజలను ఆలోచింపజేసేవారు. అంతేగాక మొక్కల ఆవశ్యకతపై స్వయంగా పద్యాలు, పాటలు రచించి వాటికి చక్కని బాణీలు కూర్చి తానే పాడేవారు. సుమారు 70 ఏళ్ళుగా మొక్కలే ప్రాణంగా జీవించిన రామయ్య మొక్కలే ప్రగతికి మెట్లుగా భావించేవారు. తల్లికి బిడ్డకు ఉన్న అవినాభావ సంబంధమే మానవుడికి ప్రకృతికి ఉన్న సంబంధంగా అభివర్ణించారు. దేవుడిపై ఉన్న భక్తి, భయం మొక్కలపై కూడా ఉండాలని అభిలషించేవారు. “చెట్టు నాటడం ఒక ప్రాణాన్ని రక్షించడమే” అనే భావనను జీవిత మార్గదర్శకంగా చేసుకొని చివరి వరకు పరితపించారు.
మొక్కలను విరివిరిగా పెంచేందుకు భారత ప్రభుత్వం ముద్రించే కరెన్సీ నోట్లపై, నాణాలపై మొక్కల బొమ్మను ముద్రించాలని పదేపదే కోరేవారు. ఆయన చివరి అంకం నాటికి ఆయన జీవిత ఆశయమైన మూడు కోట్ల మొక్కలను నాటిన తృప్తి ఉన్నప్పటికీ తాను అనుకున్న తన ఇంటిని మొక్కల మ్యూజియంగా మార్చలేకపోయారు. ఆయన పదే పదే చెప్పే కరెన్సీనోట్లపై మొక్కల బొమ్మను ముద్రించి ఆయన ఆత్మశాంతి కలిగించాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. నిస్వార్థమైన వారి ఆశయం ఆక్సిజన్ లా… వారి ఆచరణ పచ్చని చెట్టులా… భవిష్యత్తు తరాల పర్యావరణ పరిరక్షణ ఆలోచనలకు బాటలు వేయాలని కోరుకుంటూ.. వనజీవి రామయ్యకు అశ్రునివాళి.
– వనం వెంకటేశ్వర్లు (సీనియర్ జర్నలిస్టు)