Monday, January 20, 2025

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేయత్నం

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం
మంచి పనులు చేస్తేనే హైడ్రాకు తమ మద్దుతు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో కృత్రిమ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం నడుస్తుందని, హైడ్రా నుంచి కాపాడుకునేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి ప్రభుత్వంపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, వీరి స్వార్థ ప్రయోజనాల కోసం సందు దొరికితే శవంపై గద్దల్లాగా వాలుతూ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

వారికి ప్రజలపై ప్రేమ లేదని, వారి ఆస్తులను కాపాడుకునేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రలు చేస్తున్నట్లు అర్థం అవుతుందన్నారు. ఈ కుట్రలన్నీ హైడ్రా నుంచి కాపాడుకునేందుకేనని తెలిపారు. అందుకే ప్రజలు వారి ట్రాపుల్లో పడొద్దని, పేదల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ అల్లర్ల వల్ల ప్రభుత్వ లక్ష్యం గురి తప్పుతుందని, హైడ్రా నుంచి భూ ఆక్రమణదారులు తప్పించుకుంటున్నారని తెలిపారు.

మంచి పనులు చేస్తేనే హైడ్రాకు తమ మద్దతు

కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్నా, తాము పేదలకు అండగా ఎల్లప్పుడు అండగా ఉంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు చర్యలకు దిగ వద్దని, ఇంకా చాలా టైం ఉన్నందున నిలకడగా ముందుకు పోవాలని కూనంనేని సూచించారు. హైడ్రా అనేది పులి మీద స్వారీ లాంటిదని, మంచికి, చెడుకు రెండింటికీ ఉపయోగపడుతుందని అన్న ఆయన మంచికి ఉపయోగిస్తే తమ సపోర్టు ఎప్పటికీ ఉంటుందని అన్నారు. పేదలకు నష్టం చేయడానికి వీల్లేదని చెప్పారు. మూసీ విషయానికి వస్తే ఆ నీళ్లతో పండే పంటలు ప్రజలు తినరని, దొంగతనంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని నల్లగొండ ప్రజలు చెబుతున్నారని అన్నారు. మూసీ, హైడ్రాలను తీసుకొచ్చే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి సలహాలు తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మూసీ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే ముందు వారిని ప్రభుత్వం ఒప్పించి, మెప్పించి ఖాళీ చేయించాలని సూచించారు. అలాగే హైడ్రా బాధితుల్లో చాలామంది డబ్బు పెట్టి కొనుక్కున్నారని, వారికి నష్ట పరిహారం అందించాలని కోరారు. అంతేగాక అసలు భూకబ్జాదారులను వదిలిపెట్టవద్దని, హైడ్రా అంటే పేదలకు గుండె ఆగేలా చేయకూడదని, పెద్దలకు గుండె ఆగేలా చేయాలని అన్నారు. ఇక రుణమాఫీ విషయానికి వస్తే ఇంకా 20 లక్షల మందికి చేయాల్సి ఉందని వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News