చాంద్రాయణగుట్ట : ఆషాఢ మాస మహంకాళి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజైన బుధవారం అమ్మవారు ఆకు, కాయగూరల అలంకారంలో శాఖాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశేషమైన ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు బారులు తీరారు. తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయం, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, గౌలిపురా దర్వాజా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవాలయం, బేలాచందూలాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, మండిమిరాలం శ్రీ మహంకాళేశ్వర దేవాలయం తదితర ప్రాంతాలలోని అమ్మవారి ఆలయాలలో వివిధ రకాల ఆకు, కాయగూరలతో మాతేశ్వరిని శోభయామానంగా అలంకరించారు. దేదీప్యమానమైన అమ్మరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆయా ఆలయాల అధ్యక్షులు సి.రాజేందర్ యాదవ్, రాందేవ్ అగర్వాల్, ఎర్మని కైలాష్ గంగపుత్ర, రాకేష్ తివారి, పొటేల్ కిషన్ యాదవ్, గాజుల అంజయ్య, ప్రతినిధులు బి.మారుతీ యాదవ్, కె.వెంకటేష్, ఇ.సుమన్ కుమార్, బివైశ్రీకాంత్, శశాంక్ తివారి, పొటేల్ సదానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.