మన తెలంగాణ / భద్రాచలం : వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులకు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. ముందుగా గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు సుప్రభాత సేవను బాలబోగం నివేదించారు. తర్వాత ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి మత్తంగి సేవను చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వాములకు కూడా ముత్తంగి సేవను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను నరసింహావతారంలో అలంకరించి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాకార మండపానికి తీసుకొచ్చి వేదపండితులు వేదవిన్నపాలు సమర్పించారు. నాళాయర్ దివ్యప్రబంధ, వేద, క్షేత్రమహత్యం పారాయణాలు జరిగాయి. భూత, కుజ గ్రహదోషాలు ఉన్నవారు నరసింహరూప రామయ్యను దర్శించుకుంటే వాటి నుంచి విముక్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
అందుకే ఈ అవతారాన్ని గ్రామపరిక్రమణం చేస్తారు. గ్రామంలోకి ఎటువంటి చీడపీడలు రాకుండా స్వామి రక్షగా ఉంటారనేది భక్తుల నమ్మకం. ప్రాకార మండపం నుంచి స్వామివారిని భక్తుల జయజయధ్వానాలతో వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న అధ్యయన వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. తర్వాత నరసింహావతార రామయ్య తిరువీధి సేవకు తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు అందుకున్న స్వామి గ్రామపరిక్రమణానికి బయలుదేరారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలతో ముదిరాజ్ బజార్, చప్టాదిగువ మీదుగా రంగనాయకుల గుట్టను చుట్టి ఆలయానికి నరసింహస్వామి వెళ్లారు. నరసింహావతారంలో స్వామివారిని చూసిన భక్తజనం పరవశించి పోయారు. ఈ వేడుకలో దేవస్థానం ఈవో శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.