శబరిమలలో భక్తుల సౌకర్యార్థం దర్శనం రూట్ మార్చబోతున్నారు. చాలా కాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను ట్రావంకోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) పరిశీలిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులు సన్నిధానం వద్ద పవిత్ర 18 మెట్లు ఎక్కడానికి వారికి నేరుగా దర్శన అనుమతిని ఇవ్వాలని, అందుకు దర్శనం రూట్ మార్చాలని టిడిబి నిర్ణయించుకుంది. ట్రయల్ బేసిస్‌పై దీనిని మార్చి 15 నుంచి అమలు చేయాలనుకుంటున్నట్లు, తర్వాత విషు పూజ వరకు అంటే మరో 12 రోజులు కొనసాగించాలనుకుంటున్నట్లు టిడిబి అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ ప్రకటించారు. ‘ఈ ట్రయల్ కనుక ఫలప్రదమైతే తదుపరి మండలంమకరవిలక్కు సీజన్‌లో పర్మనెంట్ చేయాలనుకుంటున్నాం’ అని కూడా ఆయన తెలిపారు. శబరిమలను దర్శించుకుంటున్న భక్తులలో 80 శాతం మంది దర్శనం విషయంలో సంతృప్తి చెందనందున రూట్ విషయంలో మార్పులు తేవాలనుకుంటున్నారు. మందిరం తంత్రి నుంచి అనుమతి తీసుకున్నాకే ఈ మార్పులు తీసుకొస్తున్నారు.
‘ప్రతి భక్తుడు 20 నుంచి 25 సెకండ్ల పాటు దర్శనం చేసుకునేలా కొత్త ఏర్పాట్లు తీసుకొస్తున్నాం’ అని ప్రశాంత్ తెలిపారు. అయ్యప్ప మందిరం అభివృద్ధికి పంబ వద్ద అయ్యప్ప భక్తుల గ్లోబల్ సమావేశం కూడా నిర్వహించాలనుకుంటున్నారు. రెండు రోజుల ఈ సమావేశంలో 150 మంది వరకు పాల్గొననున్నారు. ఇదేమంత పెద్ద సమావేశం కాదు. శబరిమల వద్ద ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు అంతగా లేవని ఆయన వివరించారు. స్వామి అయ్యప్ప బొమ్మ చెక్కిన 1, 2,4,8 గ్రాములలో ఉండే బంగారు లాకెట్లను విక్రయించేందుకు ఆరంభించిన టెండర్లను తమిళనాడుకు చెందిన జిఆర్‌టి జ్వెల్లర్స్, కేరళకు చెందిన కళ్యాణ్ జ్వెల్లర్స్ గెలుచుకున్నారని, ఈ లాకెట్లను ఏప్రిల్ 14న ‘విషుకైనీట్టం’ నాడు పంపిణీ చేస్తామని అన్నారు. అయ్యప్ప మందిరంలో ఆఫరింగ్ రేట్లను కూడా 30 శాతం మేరకు పెంచబోతున్నారు. 2016 నుంచి అయ్యప్ప స్వామి మందిరం సిబ్బంది జీతాలు, పింఛన్లు పెరిగాయని కూడా ప్రశాంత్ వివరించారు.