Wednesday, January 22, 2025

చిత్రహింసలను ప్రత్యక్షంగా చూసిన పవిత్ర గౌడ

- Advertisement -
- Advertisement -

కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రేణుకాస్వామిని దర్శన్, అతని అనుచరులు చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో దర్శన్ స్నేహితురాలు సినీ నటి పవిత్ర గౌడ కూడా అక్కడే ఉన్నట్లు తాజాగా పోలీసులు వెల్లడించారు. పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు రాశారన్న అక్కసుతోనే రేణుకా స్వామిని నింఇతులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. బెంగళూరుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంని చిత్రదుర్గ నుంచి రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చి ఒక షెడ్డులో చిత్రహింసలకు గురిచేసి అతడిని హత్యచేశారని పోలీసులు దర్శన్, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. రేణుకా స్వామిని నిందితులు చిత్రహింసలకు గురిచేస్తుండగా పవిత్ర గౌడ అక్కడే కొద్దిసేపు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

కాగా.. తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన తర్వాత కన్నడ దర్శన్ తూగుదీప పలువురు వ్యక్తులను సంప్రదించాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కర్ణాటక పోలీసులు వెల్లడించారు. రేణుకా స్వామ్రికి కరెంట్ షాకులు పెట్టి చిత్రహింసలకు గురిచేసినట్లు మరో నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తనపైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి, హత్య కుట్రను, సాక్ష్యాల ధ్వంసానికి అయ్యే ఖర్చుల కోసం ఒక మిత్రుడి నుంచి రూ. 40 లక్షలను దర్శన్ తీసుకున్నారని, ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నామని గురువారం 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. దర్శన్‌తోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని, దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడతోపాటు ఇతర నిందితుల జుడిషియల్ కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు.

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రతోసహా 17 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. దర్శన్ అభిమాని అయిన చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకా స్వామి తన అభిమాన నటుడి కుటుంబంలో చిచ్చు పెట్టిన పవిత్ర గౌడను అసభ్యకరంగా దూషిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాం ఖాతాలో మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఆగ్రహించిన దర్శన్ అతని హత్యకు కుట్రపన్నాడని, రేణుకా స్వామి మృతదేహం బెంగళూరులోని సుమనహల్లి వంతెన సమీపంలో జూన్ 9న లభించిందని వర్గాలు తెలిపాయి. 47 ఏళ్ల దర్శన్‌తోపాటు ఇతర నిందితులైన ధనరాజ్ డి, వినయ్ వి, ప్రదోష్ దర్యాప్తునకు సహకరించలేదని, వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని పోలీసులు తమ రిమాండ్ దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ నలుగురు పోలీసు కస్టడీని కోర్టు గురువారం జూన్ 22 వరకు పొడిగించింది. మిగిలిన నిందితులను జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో ఎ 1(ఒకటవ నిందితురాలు)గా పేర్కొన్న పవిత్ర గౌడ కారణంగానే రేణుకా స్వామి హత్య జరిగిందని, ఇతర నిందితులను రెచ్చగొట్టి, వారితో కలసి కుట్రపన్ని నేరంలో పాలుపంచుకుందని పోలీసులు తమ రిమాండ్ దరఖాస్తులో పేర్కొన్నారు.

తన డుబ్బును, తన అభిమానులను(నిందితులు) దుర్వినియోగం చేయడం ద్వారా దర్శన్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎ 9గా ఉన్న ధన్‌రాజ్ తాను రేణుకాస్వామికి కరెంట్ షాకులు ఇచ్చి చిత్రవధ చేసినట్లు స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి కరెంట్ షాక్ ఇవ్వడానికి ఉపయోగించిన వస్తువును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అయితే ఆ వస్తువును ఎక్కడ నుంచి సంపాదించాడో మాత్రం ధనరాజ్ చెప్పలేదని, అతను ఆ సమాచారాన్ని దాస్తున్నాడని వారు తెలిపారు. అతడిని మరింత ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నేరం జరిగిన తర్వాత దర్శన్ అనేక మందిని సంప్రదించాడని, అతని సమక్షంలో విచారణ జరిపి దీని వెనుక ఉన్న ఉద్దేశాలను, కారణాలను తెలుసుకోవలసి ఉందని వారు చెప్పారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు కొందరు దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలను పోలీసులు తోసిపుచ్చారు.

దర్శన్ రెండోసారి ఇచ్చిన వాంగ్మూలంలో తాను తన మిత్రుడు మోహన్ రాజ్ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నటు ఒప్పుకున్నాడని, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి, కుట్రను కప్పిపుచ్చి సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఈ డ్బును ఉపయోగించాలని భావించాడని పోలీసులు తెలిపారు. దర్శన్ ఇంటి నుంచి రూ. 37.4 లక్షలను స్వాధీనం చేసుకున్నామని, రూ. 3 లక్షలను దర్శన్ తన భార్యకు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. సాక్ష్యాల ధ్వంసంలో నిందితుడు ప్రదోష్ కీలక పాత్ర పోషించాడని, అతను దర్యాప్తునకు సహకరించడం లేదని, సమాచారాన్ని దాస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశానికి వేరే వ్యక్తిని ప్రదోష్ తీసుకెళ్లాడని, అయితే ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదని వారు చెప్పారు. ప్రదోష్‌ను మరింతగా ప్రశ్నించాల్సి ఉందని వారు కోర్టుకు తెలిపారు.

హతుడు రేణుకా స్వామికి చెందిన మొబైల్ ఫోన్‌తోపాటు ఎ 4 రాఘవేంద్ర ఫోన్‌ను కూడా ప్రదోష్ డ్రైనేజీలో పడేశాడని, వాటిని స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులు తెలిపారు. చిత్రదుర్గ పట్టణంలోని రాఘవేంద్ర ఇంగి నుంచి రూ. 4.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర ఇంటి నుంచి రేణుకా స్వామి బంగారు ఉంగరం, బంగారు గొలుసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఉంగరం, గొలుసును రేణుకాస్వామి తల్లి గుర్తించారని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News