Monday, December 23, 2024

తెలంగాణ కళల సిగలో విరబూసిన పద్మాలు

- Advertisement -
- Advertisement -

 Darshanam Mogilaiah and Ramachandraya were awarded Padma Shri

రాష్ట్రం నుంచి 12మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య , నృత్యకారిణి పద్మజారెడ్డి, జానపద కళాకారుడు రామచంద్రయ్యలకు పద్మశ్రీ
కరోనాకు దేశీయ టీకా అందించిన భారత్ బయోటెక్ సిఎండి దంపతులు కృష్ణ, సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్
మొత్తం 128మందికి పురస్కారాలు
నలుగురికి పద్మవిభూషణ్,
17మందికి పద్మభూషణ్
పురస్కార గ్రహీతలకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ అభినందనలు

మనతెంగాణ / హైదరాబాద్, న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఏటా ఇచ్చే పురస్కారాల్లో ఈసారి మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు ప్రకటించారు. అందులో తెలంగాణ నుంచి ఐదు పద్మాలు విరబూసాయి. మొత్తం పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందిని పద్మ శ్రీ అవార్డులు వరించాయి. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సిడిఎస్ బిపిన్ రావత్(మరణాంతరం)ను పద్మ విభూషణ్ ప్రకటించారు. మిగతా ముగ్గురిలో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ (మరణాంతరం), అదే రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త రాధేశ్యామ్ ఖేమ్కా(మరణానంతరం), ప్రభా ఆత్రే (మహారాష్ట్ర) పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందిన వారిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికైనా రాజకీయ ప్రముఖుల్లో ఉన్నారు. ఫార్మా రంగంలో విశేష సేవలందించడమే కాకుండా కరోనా కష్టకాలంలో దేశీయ టీకాలను భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికి అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులతో పాటు సీరం సిఇఓ పూనావాలను పద్మ భూషణ్ పురస్కారం వరించింది.

టక్ దిగ్గజాల్లో సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు పద్మ భూషణ్ వరించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి. అలాగే భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎలాకు తెలంగాణ నుంచి సంయుక్తంగా కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ విషయానికి వస్తే తన పూర్వీకుల నుంచి కళను వారసత్వంగా స్వీకరించడమే కాకుండా పల్లె ఒడిని పాటల బడిగా చేసుకున్న 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు పురస్కారం లభించడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. అదే సమయంలో మణుగూరుకు చెందిన వోకల్, జానపదకళాకారుడు, గిరిజనుడు సకిని రామచంద్రయ్య, ప్రముఖ నృత్య కళాకారిణి పద్మజారెడ్డిలక పద్మ శ్రీ దక్కింది.

గిరిజన జాతికి రామచంద్రయ్య గర్వకారణం : మంత్రి సత్యవతిరాథోడ్

తెలంగాణ కీర్తిని ఇనుమడింప చేయడంలో గిరిజనులు గొప్ప పాత్ర పోషిస్తున్నారని, అత్యున్నత గౌరవ పురస్కారాలు పద్మశ్రీలను సాధిస్తున్నారు. గతేడాది గుస్సాడి కనకరాజు పద్మశ్రీ పొందితే…ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ జాబితాలో భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా, మణుగూరుకు చెందిన గిరిజన జానపద (డోలి, ఓకల్) కళాకారుడు రామచంద్రయ్య ఉండడం తెలంగాణకు, గిరిజన జాతికి గర్వకారణమని అన్నారు. కళలకు గొప్పసేవ చేసిన పద్మజారెడ్డి, కిన్నెర మొగిలయ్యలకి శుభాకాంక్షలు. పద్మశ్రీ పొందిన గిరిజన కళాకారుడు రామచంద్రయ్యకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

కృష్ణ, సుచిత్ర ఎల్లాకు అభినందనలు: నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

కోవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోవాగ్జిన్ తీసుకొచ్చిన ఆపద్బాంధవులు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం హర్షనీయం. దేశంపై కరోనా కోరలు చాచిన వేళ భారత్ బయోటెక్ ద్వారా ప్రజల్ని రక్షించేందుకు దేశీయంగా టీకాని అభివృద్ధి చేసి అందించేందుకు అవిశ్రాంతంగా కృషిచేసిన కృష్ణ ఎల్లా దంపతులకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అభినందనలు.

రామచంద్రయ్యకు అభినందనలు : జిల్లా కలెక్టర్ అనుదీప్

మణుగూరు మండలానికి చెందిన రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం చాలా సంతోషమని, మన జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News