బెంగళూరు: తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన కన్నడ సినీ నటుడు దర్శన్‌కు తాను మాత్రమే చట్టపరమైన భార్యనని, ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన పవిత్ర గౌడ తన భర్తకు స్నేహితురాలని స్పష్టం చేస్తూ దర్శన్ భార్య విజయలక్ష్మి గురువారం బెంగళూరు పోలీసు కమిషనర్ బి దయానందకు లేఖ రాశారు.
దర్శన్ భార్య పవిగ్ర గౌడ అని చెబుతూ విలేకరుల సమావేశంలో మీరు తప్పడు ప్రకటన చేశారని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఇదే పొరపాటును కర్నాటక హోం మంత్రి, జాతీయ మీడియా పునరావృతం చేశాయని, రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ దంపతులు అరెస్టు యినట్లు వారు పేర్కొన్నారని ఆమె తెలిపారు.
భవిష్యత్తులో తనకు, తన కుమారుడికి సమస్యలు వచ్చే అవకాశం ఉన్న కారణంగా పవిత్ర గౌడను దర్శన్ భార్యగా పేర్కొనవద్దని ఆమె పోలీసు కమిషనర్‌ను కోరారు. సంజయ్ సింగ్‌తో పవిత్ర గౌడకు వివాహమైందని, వారికి ఒక కుమార్తె కూడా ఉందని విజయలక్ష్మి తెలిపారు. ఈ వాస్తవాలను రికార్డులలో స్పష్ఠంగా నమోదు చేయాలని ఆమె అర్థించారు. దర్శన్‌తో తనకు 2003మే 19న ధర్మస్థలలో వివాహమైందని ఆమె చెప్పారు. చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడతోపాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.