న్యూఢిల్లీ: ఇస్లాంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారందరిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ డిమాండ్ చేసింది. జామియా-ఉలేమా-ఏ-హింద్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఇదేవిధంగా కొద్ది రోజుల క్రితం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ వైస్ చాన్సలర్ మౌలానా ముఫ్తీ అబుల్ కాజిం నొమానీ విడుదల చేసిన ప్రకటనలో ప్రవక్త ముహమ్మద్(స)పై అవమానకర వ్యాఖ్యలను ఖండించారు. మతపరమైన మనోభావాలను వాక్ స్వాతంత్ర్యం పేరుతో రెచ్చగొట్టకూడదన్నారు. ప్రవక్త(స)ను అవమానించడాన్ని భారత దేశంలో, ఇతర దేశాల్లో ముస్లింలు సహించరని చెప్పారు. ముస్లింల మతపరమైన చిహ్నాలను లక్ష్యంగా చేసుకునేవారిపై కేసులను నమోదు చేయడం కోసం ఓ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారత దేశం లౌకికవాద దేశమని, ఇక్కడి ప్రజలు శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు. మతపరమైన, తీవ్రవాద శక్తులు దేశ సాంఘిక సామరస్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా, దేశ లౌకికవాదానికి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. కొద్ది సంవత్సరాల నుంచి దేశంలో మతపరమైన శాంతి, సామరస్యాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మొత్తం మీద ప్రశాంత వాతావరణం క్షీణిస్తోందన్నారు.
జామియాత్ ఉలేమా హింద్ ఇటీవల స్పందిస్తూ, ఇస్లాం వ్యవస్థాపకుడిని అవమానించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపింది. బిజెపి మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అనేక ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.