బీర్కూర్: తెలంగాణ వస్తే ఏం వస్తది అన్న వారికి దశాబ్ది ఉత్సవాల్లో జవాబు చెబుతున్నామని, అధ్యాత్మికం, భక్తి పట్ల పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి సీఎం కేసిఆర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగిన అధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దేవస్థానంలో జరిగిన సుదర్శన యాగంలో సతీ సమేతంగా స్పీకర్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.పరిపాలనలో అన్ని రంగాలు ముఖ్యమేనని, అందరికి అవసరమైనది ఆధ్యాత్మికమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని, ప్రజలకు వివరించడానికే ప్రతి ఒక్క ముఖ్యమైన అంశంతో ఒక్కరోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఇది రాష్ట్ర ప్రగతి నివేదిక అన్నారు.
తెలంగాణను సాధించడమే కాదు, అభివృద్ధ్ది, సంక్షేమ రంగాలలో మన రాష్ట్రం ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల వారు మన దగ్గరకు వచ్చి చూసి నేర్చుకుని వెళుతున్నారన్నారు. ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని, 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారన్నారు. అనేక రంగాలలో ప్రతి సాధించామని, అధ్యాత్మికం కూడా ముఖ్యమన్నారు.పూర్వం రాజులు ఆలయాలను రాతి శిల్పాలతో నిర్మించారని, నేటి ప్రజాస్వామ్యంలో నిర్మిస్తున్న దేవాలయాలన్ని కూడా సిమెంట్‌తో నిర్మాణం చేస్తున్నవన్నారు. సీఎం కేసిఆర్ తన సంకల్ప బలంతో 3 లక్షల టన్నుల కృష్ణ శిలలను తెప్పించి, దేశ విదేశాల నుంచి రెండు వేల మంది శిల్పకారులను రప్పించి, 5 సంవత్సరాలు శ్రమించి 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారన్నారు.
ఇది ఒక గొప్ప అధ్యాత్మిక, భక్తి కేంద్రమన్నారు. భక్తుల కోసం పెద్ద ఎత్తున వసతి గృహాలు, ఇతర వసతులు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్దమైన ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు ఏర్పాటు చేశారన్నారు. పవిత్రత కలగాలంటే ఆలయాల శోభ పెరగాలన్నారు. 2014 నుంచి బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, మందిరాల అభివృద్ధికి దేవాదాయ శాఖ, స్పెషల్ డెవలప్‌మెంట్ నిధుల ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు. దేవాలయాల కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసిన విషయాన్ని భక్తులకు తెలియజేయడానికి ఈ అధ్యాత్మిక ఉత్సవాలన్నారు. దేవుని ప్రతినిధులు అర్చకులన్నారు. అర్చకుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. 2014కు ముందు అర్చకులకు రూ. 2 వేలు ఇచ్చేవారని, కేసిఆర్ దానిని రూ. 10 వేలకు పెంచామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 90 దేవాలయాల్లోని అర్చకులకు వేతనాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ కమిటి సభ్యులు తదితరులున్నారు.