Monday, December 23, 2024

తెలంగాణ సంస్కారానికి దాశరథి పురస్కారం

- Advertisement -
- Advertisement -

 

కొందరి వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా వుంటాయి. వేణు సంకోజు అట్లాంటి ప్రత్యేక వ్యక్తిత్వం వున్న వారిలో ఒకరు. నిరాడంబరత్వం, స్నేహశీలం, సంభాషణల్లో నిష్కాపట్యం, గ్రంథపఠనం, వక్తృత్వంలో అనుపమానం, కళల్లో ప్రవేశం ఇది వేణు సంకోజు ప్రత్యేకతలు. ఎంత ఎత్తుకెదిగినా ‘డౌన్ టు ఎర్త్’ గా వుండటం అన్న లక్షణాన్ని విస్మరిస్తే వేణు సంకోజును గూర్చి సమగ్రంగా చెప్పనట్లే భావించాలి.
కులవృత్తే ప్రధానంగా వున్న కుటుంబంలో నుంచి వచ్చిన వేణు సంకోజు ప్రధానంగా తన మాతృమూర్తి మార్గ దర్శకత్వంలో సికింద్రాబాద్‌లో ఇంగ్లీషు మీడియంలో చదివి, తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సమ ప్రతిభ వున్న రచయితల్లో వీరొకరు. పొలిటికల్ సైన్స్‌తో ఎం.ఎ చేశారు. తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించిన రాజ్యాంగ వ్యవస్థ అనే అంశం మీద పరిశోధన చేసి ఆంగ్లంలో రాసిన పరిశోధన గ్రంధానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు ఎం.ఫిల్ పట్టా ప్రదానం చేశారు. తెలుగులో కథలు, వ్యాసాలు రాసినా కవిగానే వేణు సంకోజుకు పేరొచ్చింది.
1969 నుండి వేణు సంకోజు ప్రత్యేక తెలంగాణ వాదే. గోవిందు లాగా జైలు జీవితం గడపవలసిన వాడే కాని, అప్పుడు జైళ్లన్నీ రాజకీయ ఖైదీలతో నిండిపోయాయి. అందుకే వేణు సంకోజును పది కిలోమీటర్లు వ్యాన్‌లో తీసుకుపోయి ఒక నిర్జన ప్రాంతంలో వదిలేసి వచ్చారు. దీంతో కాలినడకన ఇల్లు చేరే శిక్ష విధించినట్లయింది. ఈ సంఘటన పరవస్తు లోకేశ్వర్ ప్రసిద్ధ నవల ‘సలాం హైదరాబాద్’లో నమోదయింది.
ప్రతిభావంతుడు కావటం వల్ల ఏ పోటీ పరీక్ష రాసినా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. నిజానికి సివిల్స్ రాయవలసిన వేణు సంకోజు ప్రావిడెండ్ ఫండ్ ఆఫీసు పరీక్ష రాసి ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆప్త మిత్రుడు గోవిందుతోపాటు లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పై అధికారులకు సింహ స్వప్నమయ్యాడు. కొంత మార్పు సాధించాడు. ఆ తర్వాత ఆయనకు తానుండవలసింది విద్యాశాఖలో అన్న భావం స్ఫురించింది. వెంటనే ‘జె.ఎల్.’ పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యాడు. తమ సొంత జిల్లా నల్లగొండలోనే ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పాఠాలు చెప్పి బయటపడే పద్ధతిలో కాక, తన విద్యార్థిన, విద్యార్థులతో పూర్తిగా మమేకమై వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం తన బాధ్యతగా గుర్తించారు. తాను ఏ కళాశాలలో పని చేసినా విద్యార్థుల చేత సెమినార్లు నిర్వహింప జేయటం, మ్యాగజిన్‌లు వెలువరింపజేయటం, చిత్రకళా ప్రదర్శనలను ఏర్పాటు చేయించటం వంటివి వీరి వ్యాపకాలుగా మారినై. అట్లా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు వెల్లడి కావటానికి వేణు సంకోజు ప్రోత్సహించారు. ‘వేణు ‘సంకోజు ఎక్కడ వుంటే అక్కడ చైతన్యం వుంటుంది’ అన్న నినాదం ఊరికే రాలేదు. కొంత కాలం ఇంటర్మీడియెట్ విద్యా విభాగం వారి దృశ్య శ్రవణ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
ఇదంతా ఒకటైతే సాహిత్య రంగానికి వేణు సంకోజు చేసిన సేవ ఒక ఎత్తు. మొదట్లో శ్రీశ్రీ రావిశాస్త్రి వంటి రచయితల జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చిన దాసి సుదర్శన్‌కు పూర్తి సహకారం అందించారు. ఆ తర్వాత కాళోజీ, దాశరథి, ఆళ్వారు స్వామి వంటి తెలంగాణ వైతాళికులకు తన పూర్తి కాలాన్ని వెచ్చించారు. ఈ దశలో వారికి డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పదోన్నత లభించింది. నందిని సిధారెడ్డి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో ‘తెలంగాణ రచయితల వేదిక’ స్థాపన జరగటం, వేణు సంకోజు సంస్థాపన కార్యదర్శిగా ఎంపిక కావటం ఒక చరిత్ర. ఈ ఇద్దరు సాహితీవేత్తలు అంకిత భావంతో 2001 నుండి 2007 దాకా ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ అంతటా సభలు, సమావేశాలు, సెమినార్లు ఏర్పాటు చేసి సమరశీలంగా కృషి చేయటం మూలంగా తెలంగాణ సమాజంలో సాహిత్య రంగంలో చైతన్యం వెల్లివిరిసింది. ఇదే కాలంలో కొంత కాలం ‘సోయి’ మాస పత్రిక నిర్వహణలో పాలు పంచుకున్నారు. తామే స్వయంగా పూనుకొని ‘వీర తెలంగాణ’ మాస పత్రికను ప్రారంభించి సంపాదక బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సంస్కృతి సాహిత్యాలు, జీవిత సమస్యలు, సజీవ భాష, వైతాళికుల పాత్ర మొదలైన అంశాల మీద నిష్ణాతులతో వ్యాసాలు రాయించి ‘వీర తెలంగాణ’ పత్రికలో ప్రచురిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో రాజకీయంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పదునైన సంపాదకీయాలు కూడా వేణు సంకోజు రాస్తూ వచ్చారు. నల్లగొండ గడియార స్తంభం వద్ద కొన్ని నెలల పాటు ధర్నా కార్యక్రమాలను నిర్వహించటమేకాక, ప్రతిరోజు ఉద్యమకారులతో ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించి చైతన్యాన్ని ప్రోది చేశారు.
1988లో స్థాపించబడ్డ ‘జయమిత్ర’ సాహిత్య సాంస్కృతిక వేదిక’ను సంస్థాపక కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేంద్ర లూథర్ గారి సలహాల మేరకు, అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారు ముఖ్య అతిథిగా ‘మరో కొత్త వంతెన’ ఉర్దూ తెలుగు కవితా సంపుటి ఆవిష్కరణ అంత గొప్పగా జరగటానికి వేణు సంకోజు పూనికే కారణం.
వేణు సంకోజు సున్నితమైన మానసిక సంస్కారం ఉన్నవారు. ఆత్మీయ మిత్రులు, లౌకికవాది, ఉర్దూ కవి అయిన మజహర్ మెహదీ చనిపోయారు. అప్పుడు జయమిత్ర సభ్యులం వారి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లాం. అయితే జరిగిందేమిటంటే వాళ్లను చూడగానే వేణు సంకోజే వెక్కి వెక్కి ఏడ్చారు. వాళ్లే ఈయనను ఓదార్చ వలసి వచ్చింది! ‘అమ్మ కవి’ డొంకెన శ్రీశైలం చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి.
‘పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు పతిత మానవు జూచి చితికిపోవును మనసు’ అన్న ప్రజా కవి కాళోజీ పాదాలు అక్షరాలా వేణు సంకోజుకు వర్తిస్తాయి. అందుకే తన మొదటి కవితా సంపుటి ‘మనిషిగా పూచే మట్టి’ అని వేణు సంకోజు కాళోజీకి అంకితం చేశారు.
వేణు సంకోజు సాహిత్య కృషి చిన్నదేం కాదు. మొదటి సంపుటిలో ప్రారంభ యౌవన కాలం నుండి రాస్తూ వచ్చిన కవిత్వమంతా వుంది.
‘మనం’ కవితా సంపుటిలో పరిణత కవిత్వం కనిపిస్తుంది. ఇవి కాక మరో నాలుగు కవితా సంపుటాలున్నాయి. వీరి కథానికల సంపుటి ‘స్పర్శ’ విలువైనది. ‘హై‘ధరా’బాధ’ కవితలో ‘ఇవాళ కాలుష్యంలో విస్తరించిన నా కన్న తల్లి నగరం
ఒకనాడు నా బాల్యాన్ని లాలించింది నన్నాడించింది
నా చుట్టూ ఆవరించిన లోకాన్ని నా అమాయక కళ్లలోకి ఆహ్వానించింది’ అంటూ హైదరాబాదు నగరాన్ని తన కన్నతల్లిగా ప్రేమిస్తున్నారు, ప్రేమించటం తప్ప మరేమీ తెలియని వేణు సంకోజు!
ఈ తెలంగాణ ప్రేమికునికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘దాశరథి కృష్ణమాచార్య పురస్కారం’ ప్రదానం చేస్తున్నందుకు సాటి కవిగా నా అభినందనలు.

(మహాకవి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం జులై 22 నాడు ప్రముఖ కవి వేణు సంకోజుకు అందజేస్తున్న సందర్భంగా…)

అమ్మంగి వేణుగోపాల్
9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News