Saturday, December 28, 2024

చిత్రపురి కాలనీలో దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ

- Advertisement -
- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్, దర్శకుడులు ఎన్ శంకర్, రేలంగి నరసింహారావు, దాసరి తనయుడు అరుణ్ కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాత ప్రసన్న కుమార్, మణికొండ మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, వసంతరావ్ చౌహన్, చిత్రపురి కాలనీ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ లలిత, కమిటీ సభ్యులు అనిత, రఘు బత్తుల, అలహరి, రామకృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి నారాయణరావు గారి విగ్రహాన్ని ఆయన జయంతి రోజున మన చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. వాస్తవానికి దాసరి గారి విగ్రహంతో పాటు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం, చిత్రపురి కాలనీ రూపశిల్పి డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డిగారి విగ్రహాలు కూడా ఇదే రోజు ఆవిష్కరించాలని అనుకున్నాం కానీ అవి వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని పెద్దలు సూచించిన మీదట ఇవాళ దాసరి గారి విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరించాం. గుట్టలు, రాళ్ల మధ్య చిత్రపురి కాలనీ స్థాపించుకున్నప్పుడు సినీ కార్మికులకు ఇండ్లు ఉండాలని కోరుకుని అన్ని రకాలుగా సహాయం చేసిన వ్యక్తి దాసరి.

ఆయన సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటూ ఆదుకునేవారు. ఆయన పలుకుబడితో అప్పటి ప్రభుత్వం తరుపున అనేక రాయితీలు మన కాలనీకి ఇప్పించారు. చిత్రపురి కాలనీ ప్రధాన రహదారిలో దాసరి గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి బయటకు వెళ్లేప్పుడు వచ్చేప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చిన భావన కలుగుతుంటుంది. ఇవాళ దాసరి గారు లేకపోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఏ చిన్న సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ ఒక పెద్దలా పరిశ్రమ కష్టాలు తీర్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను నిత్యం స్మరించుకుంటుంది. అని అన్నారు.

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…సినీ కార్మికుల పక్షపాతిగా ఉంటూ దాసరి గారు 24 విభాగాల కార్మికుల అభిమానం పొందారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసేవారు. దర్శకుడిగా మరెవరికీ సాధ్యం కాని విధంగా 150కి పైగా సినిమాలు తెరకెక్కించి గిన్నీస్ బుక్ రికార్డులు సాధించిన మహనీయుడు దాసరి. ఆయన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండేది. ప్రజాహితం కోసం దాసరి గారు సినిమాలు రూపొందించి ప్రజల్ని ప్రభావితం చేశారు.

బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రేక్షకాభిమానంతో పాటు అనేక అవార్డులు పొందారాయన. అలాంటి దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం మన అదృష్టం. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసి దేశానికి సేవలందించారు. దాసరి గారు చనిపోయాక చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. నాకు ఆయనతో ఎన్నో ఏండ్ల పాటు మంచి అనుబంధం ఉండేది. ఆయన విగ్రహాన్ని చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నది. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరుపున సినిమాలకు అవార్డులను ప్రకటిస్తాం. అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News