అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సుధ 76.25 శాతం ఓట్లను సాధించి. 90,533 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు రాగా బిజెపికి 21,678 ఓట్లు, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది.
బిజెపి, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు గల్లంతు
బద్వేల్‌లో బిజెపి, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి.ఈక్రమంలో బిజెపి,టిడిపి, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయి. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని డాక్టర్ సుధ పేర్కొన్నారు.
డాక్టర్ దాసరి సుధకు సిఎం అభినందనలు
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు” అన్నారు సీఎం జగన్.
జగన్ కంటే అత్యధిక మెజార్టీ
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఎపి సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే.గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త కంటే దాదాపు రెట్టింపు మెజారిటీని సాధించారు. దాసరి సుధకు మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి.