Monday, December 23, 2024

దళిత సాహిత్యానికి దశ, దిశ మద్దూరి నగేష్ బాబు

- Advertisement -
- Advertisement -

మద్దూరి నగేష్ బాబు తెలుగు కవిత్వంలో ఒక కల్లోల కెరటం. ఇంకా చెప్పాలంటే కవిత్వ తీరప్రాంతాలను ముంచెత్తిన సునామీ కెరటం. దళితకవిత్వంలో అతనిది పెను ధిక్కార స్వరం, ఆ స్వరంలో గంధకపు గనులున్నాయి. ఆ మాటల్లో డైనమైట్లు ఉన్నాయి. మొల చుట్టూ విచ్చుకత్తులు ధరించిన వేయి బాహువుల కార్తవీర్యార్జునుడు నగేష్ బాబు. దళిత కవిత్వానికి జవాన్నీ, జీవాన్ని ఇచ్చిన ఆజానుబాహుడు. కవిత్వ సంపదలో వీరబాహుడు. దళితకవిత్వంలో అనేక విషయాలలో గొప్ప ప్రారంభకుడు. అతని వెలివాడ కవితా సంపుటి దళిత కవిత్వంలో వెలువడిన పూర్తి స్థాయి వచన కవితా సంపుటి. కవిత్వంలో అతను తెచ్చిన మార్పులు ఒకటి భాషా విప్లవం, రెండు దళిత నుడికారం. నగేష్ బాబుకు ముందున్న దళితకవులు అప్పటికి చలామణీలో ఉన్న ప్రామాణిక వచన కవిత్వ భాషనే తమ కవిత్వభాషగా ఉపయోగిస్తూ వచ్చారు. నగేష్ బాబు ఆ భాషను ధ్వంసం చేసి, దాని స్థానంలో వాడభాషను ప్రవేశపెట్టాడు. కవితా నిర్మాణంలో అతనిది మౌఖిక సంప్రదాయం. పాఠకునితో కవి నేరుగా మాట్లాడే ఒక సంభాషణాత్మక రచనావిధానం అతని కవిత్వ సంవిధానం. నగేష్ బాబు రంగప్రవేశంతో దళిత సాహిత్యం ఒక దిశానిర్దేశాన్ని, ఒక నిర్దిష్టతను సంతరించుకుంది.
దళిత సాహిత్యంలో కవయిత్రులు లేని లోటును ముందుగా పసిగట్టినవాడు. అందుకే తన కవిత్వంలో దళితస్త్రీల వెతలను అత్యంత శక్తివంతంగా చిత్రించి, మద్దూరి నగేష్ బాబు దళిత కవయిత్రులకు మార్గదర్శకుడయ్యాడు. దళిత కవిత్వంలో దళిత స్త్రీవాదం అనే సాదుకు అతను పరోక్ష ప్రేరకుడు. తెలుగులో విశిష్ట దళిత దీర్ఘకావ్యం అతని రచ్చబండ. అంతకుముందు కొందరి ఖండికలలో దీర్ఘకావ్య లక్షణాలు రేఖామాత్రంగా కనిపించినా ఒక నిర్దిష్ట ప్రణాళిక, వస్తునిర్వహణతో వెలువడిన రచ్చబండ దళిత దీర్ఘకావ్యాలకు ఒరవడి పెట్టింది. దళిత సాహిత్యాన్ని ఒక ఉద్యను స్ఫూర్తితో, సామూహిక భావనతో సృజించాల్సిన అవసరాన్ని గుర్తించాడు. కాబట్టే మరో ముగ్గురు కవులతో ’నిశానీ’ సంకలనాన్ని తీసుకొచ్చి సంచలనం కలిగించాడు. ’నిశాని’ కవిత్వంలో ఉపయోగించిన భాషపై స్త్రీ వాదులతో పాటు దళిత కవులూ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వ్యాసాలు రాశారు.
తెలుగులో దళిత కవిత్వం ప్రధాన స్రవంతిగా మారిన చారిత్రక సన్నివేశంలో చాలామంది కవులు కలాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో సాహిత్యానికి అంటరానితనం అవసరం లేదనీ, దళితుల పక్షాన దళిత రచయితలు సైతం మాట్లాడవచ్చనీ, దళిత సంఘీభావ కవిత్వాన్ని ’కాస్త సిగ్గుపడదాం’ పేరుతో సంకలించాడు. హెచ్చార్కె, సుజాత పట్వారీ, రాంరెడ్డి వంటి వారిని దళిత సాహిత్యంలోకి ఆహ్వానించాడు. ఆ స్ఫూర్తితో రాంరెడ్డి వంటి కవులు ముల్లుగర్ర లాంటి దళిత సంఘీభావ కవితా సంపుటిని వెలు వరించడానికి దోహదం చేశాడు. సమాజంలోని రెండు కొసలు అయిన అగ్రహారాన్ని వెలివాడను కలుపుతూ రాణి శివశంకరశర్మతో కలిసి ’ఊరూ ’వాడ’ దళిత సంయుక్త దీర్ఘకవితను వెలువరించాడు. తెలుగు ముస్లింవాద సాహిత్యానికి నగేష్ బాబు ప్రత్యక్ష ప్రేరకుడు. అప్పటికి ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ’ వంటి కవితలు వెలువడినా వాటిలో చరిత్రలో జరిగిన కుట్ర వ్యక్తమైనంతగా ముస్లింల మూలాలు, భాషా సంస్కృతులు పూర్తి స్థాయిలో వ్యక్తం కాలేదు. అప్పటికింకా మామూలు వచన కవిత్వ భాషలో అనుభూతివాద ధోరణిలో ఖాజా వంటి కవులు కవిత్వం రాస్తున్న సమయంలో నీ కవిత్వంలో నీ భాష, నీ సంస్కృతి, నీ భావజాలం వ్యక్తం కావాలని మార్గనిర్దేశనం చేసినవాడు నగేష్ బాబు. ముస్లింవాద కవిత్వానికి లక్ష్యప్రాయమైన తొలి వచన కవితా సంపుటి ’ఫత్వా’ వెలువడానికి నగేష్ బాబు దోహదం ఎంతైనా ఉంది. ఖాజా, ఫత్వా తర్వాతే తెలుగు ముస్లింకవులు తమ కవిత్వాన్ని తమ మూలాల నుండి భావజాలం నుండి భాషా సంస్కృతుల నుండి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు.
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో జరిగిన సంస్కృతీకరణకు ప్రతిగా ఆధునిక తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న ప్రతికొత్త ప్రక్రియను దళితీకరణ చెయ్యాలనే తీవ్రమైన అభిప్రాయం గల నగేష్ బాబు, తన జీవితకాలంలో వాటిని ఆచరించి సాధించి చూపించాడు. గజల్, హైకూ వంటి ప్రక్రియల్లో సైతం దళిత తత్వాన్ని రంగరించి దళిత గజల్, దళిత హైకూలను వెలువరించాడు. అందులో భాగంగా వచ్చిందే ’విడి ఆకాశం’. మిగతా వారితో పోలిస్తే దళితుల జీవితానుభవాలు భిన్నంగా ఉంటాయని ఈ అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వం సంకలనం నిరూపించింది. ఈ సంకలనానికి నగేష్ బాబు ప్రధాన సంపాదకుడు. కథా రచనను కూడా చేపట్టిన నగేష్ బాబు దళితుల జీవితంలోని అతి సున్నిత అంశాలను కథలుగా మలిచాడు. సృజనాత్మక ప్రక్రియలతో పాటు విమర్శపై కూడా దృష్టి సారించాడు. ’చిక్కనవుతున్న పాట’ సంకలనం రేపిన దుమారంలో తాను విమర్శలు రాయడమే కాకుండ మిత్రుల చేత కూడా రాయించాడు. దళిత కవయిత్రుల కవితలపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో నవ్య పేజీలో ధారావాహికంగా వ్యాసాలు రాశాడు. ఖాజా ఫత్వా. బన్న ఐలయ్య నిప్పుకణిక, కరీముల్లా కవిత్వానికి, విడి ఆకాశం సంకలనానికి రాసిన ముందు మాటల్లో దళిత సాహిత్యం గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇక్బాల్ చంద్ మొదటి కవితా సంకలనం ’బ్లాక్ వాయిస్‌కు నగేష్ బాబు రాసిన సంచలనాత్మక ముందుమాట కారణంగానే వెలుగు చూడకుండా ఆగిపోయింది. దళిత సాహిత్యంలో నగేష్ బాబు ప్రవేశపెట్టిన ఈ పెనుమార్పులు అంత సులువుగా ఆమోదం పొందలేదు. అందుకు ఇంటా బయటా పెద్ద పోరాటమే చేశాడు. దళిత వ్యతిరేక శిబిరం నుండే కాక దళిత శిబిరం నుండి కూడా కొత్త శత్రువులు తయారయ్యారు. అయినా అతను తను నమ్మిన మార్గాన్ని వీడలేదు. హిందూ పురాణ ప్రతీకలను తలకిందులు చెయ్యటమే కాకుండా హిందూ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా దళితులు క్రైస్తవ సంస్కృతిని ఆచరించాలని చివరి రోజులలో ప్రగాఢంగా విశ్వసించాడు. తన చివరి కవితా సంపుటి ’నరలోక ప్రార్థన’కు దళిత క్రిస్టియన్ పొయిట్రీ అనే ఉపశీర్షికను ఉంచి సరికొత్త వివాదానికి తెరతీశాడు. ఎన్ని చేసినా అతను దళిత సాహిత్యానికి ప్రధాన కేంద్రబిందువుగా నిలిచాడు. దీనికి కారణం మడమ తిప్పడం ఎరగని అతని కవితాశక్తీ, దళిత నిబద్ధత.

డా.శిఖామణి
9848202526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News