రైతులను అవమానించిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : మూడు ఎకరాల రైతుకు 3 గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించిన పిసిసి చీఫ్ రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎలాంటి కష్టాలు పడ్డారో? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో? కరెంట్ లేక ఎన్ని తిప్పలు పడ్డారో? ఆధారాలతో మీడియా ముందు ఉంచారు. వీటికి రేవంత్ సమాధానం చెప్పడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకముందు రైతాంగం వ్యవసాయం దండగ అనే రీతిలో ఉండేదని,అలాంటి రైతాంగాన్ని సిఎం కెసిఆర్ వ్యవసాయం అంటే ఓ పండగల మార్చారన్నారు. రైతులకు కెసిఆర్ పెద్దన్నలా, తండ్రిలా ఉంటూ వారి కోసం పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. రోజుకు కనీసం 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని, సాగుకు కరెంట్ కట్ చేసారని, పరిశ్రమలు కరెంట్ కోతలు ఉండేవని, ఇంట్లో ప్రజలు ఉండాలన్న
ఉండలేని పరిస్థితి ఉండేదని ఎద్దేవా చేశారు. ఈనాడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? అని శ్రవణ్ ప్రశ్నించారు. సిగ్గుంటే కర్ణాటకలో 24 గంటలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వరని, ఇవన్నీ రేవంత్ కళ్లు తెరచి చూడాలని సూచించారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదంటున్న రేవంత్ ట్రాన్సఫార్మర్‌లో వేలు పెట్టాలని, అప్పుడు రేవంత్ బ్రతికి ఉంటే రాష్ట్రంలో కెసిఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చినట్లే, రేవంత్ చస్తే కెసిఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వనట్లే అని ఎద్దేవా చేసారు. తెలంగాణలో రైతులు బాగుపడుతుంటే రేవంత్ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నాటికీ తెలంగాణ సాగు విస్తీర్ణం కోటి 30 లక్షల ఎకరాలు ఉంటె 2022 నాటికీ సాగు విస్తీర్ణం రెండు కోట్ల 20 లక్షలకు పెరిగిందని , సాగు విస్తీర్ణం రెట్టింపు ఎలా అయ్యిందో రేవంత్‌కు తెలియదా..? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న పాలమూరు ఇప్పుడు కోనసీమాల మారిందని, దీనికి కారణం కెసిఆర్ అని అన్నారు. గతంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి 3040 ఏళ్లు పట్టేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేవలం మూడున్నర ఏళ్లలో కెసిఆర్ పూర్తి చేసి నీరు అందించిన భగీరధుడని, వ్యవసాయాన్ని, రైతులను కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారన్నారు. రైతుల కోసం రైతు భీమా, రైతు బంధు తీసుకొచ్చారు కెసిఆర్, ఏదైనా కారణాల వల్ల రైతు మరణం సంభవించినచోవారి కుటుంబానికి ఈ పథకం కింద రూ .5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నారన్నారు. రైతు బీమా కార్యక్రమం కింద, రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం అందిస్తున్న దేవుడు కెసిఆర్ అని అన్నారు. అలాంటి దేవుడిఫై సభ్యత , సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తెలంగాణ రైతులు ఛీ కొడుతున్నారన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌కు , తెలంగాణకు రేవంత్ రెడ్డి శని పట్టినట్లు పట్టాడని, కేవలం తెలంగాణకే కాదు సభ్యసమాజానికి రేవంత్ ఓ శని అని శ్రవణ్ అన్నారు.