తండ్రి వయసున్న కెసిఆర్‌ను పట్టుకొని రేవంత్‌రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు
బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి
10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు…?
శవాల మీద పేలాలు ఏరుకునే తీరు రేవంత్‌ది : బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఓ ర్యాలీలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పోయింది
సిఎం కెసిఆర్‌కు పిండం పెట్టాలని రేవంత్‌రెడ్డి అన్నాడు కాబట్టి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : శ్రవణ్
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ నిత్యం సమీక్ష నిర్వహిస్తూ, అధికారులను, పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. నిద్ర పోకుండా, అధికారులను నిద్ర పోనివ్వకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేశారని బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. అలాంటి కెసిఆర్ పట్టుకొని రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రి వయసున్న కెసిఆర్‌ను పట్టుకొని పిండం పెట్టాలని మాట్లాడుతున్నావు..అది నోరా..మూసి నదా..? అని మండిపడ్డారు. 70 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్ అంటూ రేవంత్ రెడ్డిని శ్రవణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి, సిఎంను పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అంటావా..?..అతడికి కేసీఆర్ కు పోలిక ఏంటి..? అసలు ఇలా మాట్లాడొచ్చా..? ఆయన వయసుకు గౌరవం ఇవ్వరు…సిఎం కుర్చీకి గౌరవం ఇవ్వవు అని మండిపడ్డారు. బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలని శ్రవణ్ డిమాండ్ చేసారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుంటే..నువ్వు ఎక్కడ పడుకున్నావ్..రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. ఎంపి రేవంత్ రెడ్డి కనిపించడం లేదని పోస్టర్లు వెలిస్తే తప్ప రేవంత్‌కు జనాల మధ్యకు రావాలని అనిపించలేదా? అని ప్రశ్నించారు.
వర్షాలు తగ్గిన తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వం వరద ముప్పుపై సమీక్షలు చేయలేదు..ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కెటిఆర్ పట్టించుకోలేదని మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా గత వారం రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు, గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని,ఈ వర్షాలకు వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహించాయని చెప్పారు. వరదలతో ప్రజలు ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడం మానేసి కెసిఆర్, కెటిఆర్‌లపై విమర్శలు చేయడానికి రేవంత్‌రెడ్డికి మనసెలా వచ్చింది..? అని ప్రశ్నించారు. వరదలు వస్తే పాలు, బ్రేడ్, పులిహోర, అన్నం పంచవు కానీ మీ కార్యకర్తలతో శాలువా కప్పించుకొని ఉరేగుతున్నావు..అసలు నువ్వు మనిషివేనా అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్‌కు పిండం పెట్టాలన్న రేవంత్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం, ఏదిపడితే అది అనడం చేస్తున్నాడని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కించపరచడం తప్పు కాదు కానీ దానిపేరు మీద ఎలాపడితే ఆలా, ఎవర్ని పడితే వారిని అవతలి వ్యక్తి వయసును సైతం లెక్కచేయకుండా అనరాని మాటలు అనకూడదని అన్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఓ ర్యాలీలో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు గుజరాత్ కోర్టులో కేసు వేస్తే..రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పోయిందని, మరి ఈరోజు కెసిఆర్‌కు పిండం పెట్టాలని రేవంత్‌రెడ్డి అన్నాడు కాబట్టి అతని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సబర్మతీ ఆశ్రమానికి ఎవరైనా వెళ్లి బాపు… మీ శిష్యునిగా ఉంటూ..స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటా అంటే..ముందుగా వారిచేత టాయిలెట్స్ కడిగించేవారని తెలిపారు. ఆలా ఒకటి, రెండుసార్లు కాదు మూడు, నాలుగు సార్లు కడిగించిన తర్వాత..సబర్మతీ ఆశ్రమంలో అన్ని పనులు చేశావు కాబట్టి సమాజంలో అంతకంటే పేరుకుపోయిన మురికిని శుభ్రం చెయ్యి అని స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మగాంధీ చేర్చుకునేవారని చెప్పారు. అలాంటి సిద్దాంతం కాంగ్రెస్ పార్టీదని, కానీ రేవంత్ లాంటి గాడ్సేకు మహాత్మాగాంధీ సిద్ధాంతం అర్ధం కావడం లేదని విమర్శించారు. ముందు రేవంత్ రెడ్డిని సబర్మతి ఆశ్రమంలో టాయిలెట్స్‌ను కడిగించలని రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గేను శ్రవణ్ కోరారు.
పౌరుష పదజాలం, బూతుపదజాలమే రాజకీయమా?
పౌరుష పదజాలం, బూతుపదజాలమే రాజకీయమా..?.. ఇదేనా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి నేర్పింది..? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. విధివిధానం తప్పు ఉంటె కించపరచండి, మంచి జరగాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఎలాపడితే ఆలా కించపరుస్తాం అంటే కుదరదని అన్నారు. వర్షాలు పడుతుంటే ప్రజలను అదుకోవాల్సింది పోయి..ఇంట్లో పడుకొని, తీరిగ్గా వర్షాలు తగ్గిన తర్వాత బయటకు వచ్చి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, అధికారులపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ వారసులమని, 120 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు అని, అలాంటి హోదాలో ఉన్న రేవంత్ రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. యాదవులు పేడ పిసుకుంటారని కించపరచడం, దొమ్మర్లను, వంశరాజులను హేళన చేయడం..మిగతా కులాలను చులకన చేయడం రేవంత్‌కు అలవాటుగా మారిందని అన్నారు. గొల్ల కురుమలు, బిసిలను,ఎస్‌సిలను, ఎస్‌టిలను …ఇలా ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ చిల్లర రాజకీయాల కోసం ప్రతిపక్షాలను, పేద ప్రజలను హీనమైన పదజాలంతో దుర్భాషలాడడం, అందరినీ కించపరచడం మంచిది కాదని చెప్పారు. తమ నైజాం ఇదే..ఇలాగే మాట్లాడతాం అంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని శ్రవణ్ హెచ్చరించారు.