Monday, December 23, 2024

రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సిఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కన్న తండ్రి లాగ పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయని రేవంత్‌రెడ్డిని లేఖలో నిలదీశారు. అడ్డగోలు సంపాదనకు, దోపిడీకి అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన రేవంత్ రెడ్డికి, పేదింటి పిల్లల కడుపుమంట, బాధ తెలియదని పేర్కొన్నారు. పొద్దున్నే స్కూళ్లలో పసి పిల్లల కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతుంటే రేవంత్‌రెడ్డి కళ్ళలో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారని ప్రశ్నించారు. 50 ఏళ్ల మీ పాలనలో పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బందులు కాకుండా పొద్దున్నే పిల్లలకు పౌష్టికాహారం తినిపించాలన్న సోయిలేని మీరు.. ఇవాళ ఇవన్నీ అమలు చేస్తున్న కెసిఆర్‌పై దాడి చేయడం మీ మానసిక దౌర్భల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 23 లక్షల మంది పసి పిల్లలకు సిఎం కెసిఆర్, ఒక తాత లాగా కడుపునిండా కమ్మని ఫలహారం (బ్రేక్ ఫాస్ట్ ) పెట్టి కన్నతండ్రి లాగా ఆ పిల్లలకు అండగా ఉంటుంటే మీ కడుపులు ఎందుకు మలమల కాలుతున్నాయని నిలదీశారు.

ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టె పరిస్థితీ వచ్చింది
ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే పనికిరాని బడి అన్నట్టు అభిప్రాయం ఉండేదని, కానీ నేడు అద్భుతమైన సౌకర్యాలతో ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టె పరిస్థితీ వచ్చిందని దాసోజు శ్రవణ్ లేఖలో వివరించారు. అద్భుతమైన భవనాలు, కమ్మటి ఫలహారం.. మంచి మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉచితంగా నాణ్యమైన యూనిఫామ్ బట్టలు .. ఒక చక్కటి వాతావరణం లో విద్యానందిస్తున్న విద్యాదాత కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. ఇంత నీచానికి దిగజారిపోయి, పిల్లల కడుపులు కొట్టే రేవంత్ రెడ్డి మాటలు బడుగు, బలహీన, దళిత, గిరిజన, పేద వర్గాల జనం నమ్మరని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లల ఆకలి తీరుస్తూ వారు బాగా చదువుకోవాలని సిఎం కెసిఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం తెస్తే దానిపై రేవంత్ రాజకీయం చేయడం కుళ్ళబోతుతనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం పేద పిల్లలకు వరం అని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదు అనే సూత్రాన్ని నమ్మిన సిఎం కెసిఆర్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం అభినందించవలసిన విషయమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News