విద్యార్థుల నుంచి సిఈఓల వరకు
విక్రయానికి కోట్లాది మంది డేటా
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా కంపెనీల ప్రతినిధులు
హైదరాబాద్: డేటా చోరీ నిందితులు విద్యార్థుల నుంచి సిఈఓల వరకు ఎవరినీ వదలలేదు. అందరి డాటానే చోరీ చేసి మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. అందరి డాటాను కొనుగోలు చేసిన సైబర్ నేరస్థులు వారికి ఫోన్లు చేయడమే కాకుండా వారు చేస్తున్న ఉద్యోగం, హోదా తదితర వివరాలు చెప్పి దోచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి డేటా చోరీ కేసులో నిందితులు డబ్బుల కోసం సిబిఎస్‌సి విద్యార్థులు, పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన 4.2లక్షల మంది విద్యార్థుల డేటాను చోరీ చేశారు.
వీరి వద్ద 2కోట్ల మంది విద్యార్థుల డేటాను చోరీ చేసి విక్రయానికి పెట్టారు. ఇందులో చాలామంది మైనర్లు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సైబర్ నేరాల గురించి వారికి ఎలాంటి అవగాహన ఉండకపోవడంతో సులభంగా వారి ఉచ్చులో పడే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యార్థుల డేటాను తమ వద్ద పెట్టుకుని వారిని బ్లాక్‌మేయిల్ చేసే అవకావశం ఉంది, దీంతో సైబర్ నేరస్థుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. సిబిఎస్‌ఈ 12వ తరగతి చదివే విద్యార్థుల మొబైల్ నంబర్లు, ఈమేయిల్, స్ట్రీమ్, రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ వివరాలు తెలుసుకున్నారు. వ్యాపారులకు సంబంధించిన కోటి మంది వివరాలు సేకరించారు.
అందులో వారు అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే 40లక్షల మంది నిరుద్యోగుల డాటాను సేకరించారు. దీనిని సైబర్ నేరస్థులకు విక్రయిస్తే వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం ముంచుకువస్తోందని ప్రపంచ వ్యాప్తంగా భయాలు నెలకొన్న సమయంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాలు పోయిన వారు మళ్లీ ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లోని పలు వెబ్ సైట్లలో తమ వివరాలు పొందుపర్చారు. వారికి సైబర్ నేరస్థులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. గత కొంత కాలం నుంచి ఇలాంటి నేరాలు చోటుచేసుకుంటున్నాయి. కార్ల యజమానులు 1.47 కోట్ల డేటాను చోరీ చేశారు నిందితులు. దీంతో డబ్బులు ఉన్న వారి వివరాలు వారికి తెలిశాయి. వారు కొనుగోలు చేసిన కారు వివరాలు, చిరునామా తదితరాలను సేకరించారు. దీని ఆధారంగా కార్లు కొనుగోలు చేసిన వారి ఆర్థిక పరిస్థితిని సైబర్ నేరస్థులు సులభంగా అంచనా వేయవచ్చు.
టీచర్లు 5.7లక్షలు, అడ్వకేట్లు, లాయర్లు 1.64లక్షలు, ఏజెంట్లు 28,000, అప్పారెల్, గార్మెంట్స్ 65,200మంది, ఆర్కిటెక్చర్లు, ఇంటీరియర్ డిజైనర్లు 65,000, బ్యూటీపార్లర్, హెయిర్ కట్టింగ్ సెలూన్లు, స్పాకు చెందిన 70,000, బిపిఓ కాల్ సెంటర్ ఉద్యోగులు 2.6లక్షలు, బిజినెస్ అనలిస్టులు 25వేలు, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ ప్రొఫెషనల్స్ 1.50లక్షలు, క్యాబ్ యూజర్స్ 1.84లక్షలు, సిబిఎస్‌సి స్కూల్‌స ఈమేయిల్ ఐడిలు 18వేలు,సెల్ ఫోన్ షాపుల యజమానుల 13,600, సిఈఓ, సిఎఫ్‌ఓ, సిటిఓ, సిఎంఓలు 2లక్షలమంది, ఛానల్ సేల్స్ పర్సన్స్ డేటా బేస్ 50వేలు, ఛార్టెడ్ అకౌంటెంట్లు 42వేలు, కెమికల్ ఫార్మా కంపెనీలు డేటా బేస్ 39వేలు, కెమిస్టులు 1.23లక్షలు, ఛీఫ్ మేనేజర్లు 20,800మంది, సివిల్ ఇంజనీర్లు 2.53లక్షలు, కంపెనీల ఎండిల 5.2 డేటా, క్రెడిట్ కార్డు హోల్డర్లు 98లక్షల మంది, డెబిట్ కార్డు హోల్డర్లు 8.1లక్షలు, డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీకి చెందిన 2.55లక్షల మంది, ఫేస్‌బుక్ యూజర్లు 17లక్షలమంది, ప్రభుత్వ ఉద్యోగులు 11లక్షల మంది, ఐటి ఉద్యోగులు 15లక్షలు,మొబైల్ నంబర్ డేటా బేస్ 3 కోట్లు,ఎన్‌ఆర్‌ఐలు 1,26,0633మంది, ఓఎల్‌ఎక్స్ 15లక్షలు, వాట్సాప్ యుజర్లు 1.20కోట్ల మంది డేటాను నిందితులు సేకరించి అమ్మాకానికి పెట్టారు.
డీ మ్యాట్ ఖాతాదారులు…
ఇటీవలి కాలంలో యువకులు ఎక్కువగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. కరోనా తర్వాత కొత్తగా దాదాపు 3కోట్ల మంది యువకులు డీ మ్యాట్ అకౌంట్‌ను ఒపెన్ చేశారు. ఇందులో 35లక్షల మంది డీ మ్యాట్ ఖాతాదారుల డేటాని నిందితులు చోరీ చేశారు. స్టాక్ మార్కెట్ వద్ద ఉండాల్సి అత్యంత రహస్యమైన డీ మ్యాట్ హోల్డర్ల ఖాతా వివరాలు సులభంగా డేటా చోరీ నిందితుల చేతుల్లోకి వెళ్లింది. దీనిని వారు సైబర్ నేరస్థులకు విక్రయించడంతో వారు బాధితులను తాము చెప్పిన కంపెనీల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి నిండాముంచే అవకాశం ఉంది. అలాగే వారికి ఖాతా వివరాలు తెలుసుకుని డీ మ్యాట్ ఖాతాలోని డబ్బులను నకిలీ బ్యాంక్ ఖాతాలకు మళ్లీంచుకునే అవకాశం ఉంది.