సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చిన ఆర్‌బిఐ
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు టోకెనైజేషన్ నిబంధనల అమలుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఇంతకుముందు కూడా జూలై 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్‌బిఐ అన్ని రకాల వ్యాపార విభాగాలకు ఒకసారి గడువు పొడిగించింది. ఈ నిబంధనల అమలుపై అనేక సమస్యలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు కోరడంతో సెంట్రల్ బ్యాంక్ రెండోసారి గడువును ఇచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డులతే అన్ని రకాల ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీలకు యూనిక్ టోకెన్‌లను మార్పు చేయడం ఆర్‌బిఐ తప్పనిసరి చేసింది. పేమెంట్ అగ్రిగేటర్‌లు, పేమెంట్ గేట్‌వేలు లేదా వ్యాపారులు తమ కస్టమర్‌ల డెబిట్, క్రెడిట్ కార్డ్ డేటాను స్టోర్ చేయలేరు. సెప్టెంబర్ 30 తర్వాత డేటాను తొలగించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఈ నియమం 2022 జనవరి 1 నుండి అమలు చేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది.
ఆ తర్వాత ఆర్‌బిఐ ఈ కార్డ్ టోకనైజేషన్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కొత్త నిబంధన ఇప్పుడు సెప్టెంబర్ 1 అమల్లోకి రానుంది. అంటే చెల్లింపు వ్యాపార సంస్థలు కస్టమర్ కార్డ్ డేటాను తొలగించాలి. డెబిట్, -క్రెడిట్ కార్డ్ వివరాలను ప్రతిసారీ నమోదు చేయాలి. 2022 సెప్టెంబర్ 1 నుండి కస్టమర్ ప్రతిసారీ 16-అంకెల డెబిట్-క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, కార్డ్ ధృవీకరణ విలువ (సివివి) టైప్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడానికి లేదా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, హాట్‌స్టార్ రీచార్జ్ చేయడానికి ప్రతి లావాదేవీని ఇలాగే చేయాల్సి అవసరం ఉంటుంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ వినియోగంతో ఎక్కువ మంది ప్రజలు హోటళ్లు, దుకాణాలు లేదా క్యాబ్‌లను బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్లు వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నారు. ప్రజలకు మెరుగైన భద్రతను అందించడానికి, ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితంగా చేయడానికి ఆర్‌బిఐ జూన్ 30 తర్వాత నిల్వ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను తొలగించాలని అన్ని వ్యాపారులు, చెల్లింపు గేట్‌వేలను కోరింది.