మన తెలంగాణ/హైదరాబాద్ : తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి ముస్తాబవుతున్న నూతన సచివాలయ భవనాన్ని, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను, అనంతరం అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహాల పనులను ఆయన పరిశీలించి అధికారులు, వర్క్ న్సీకి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సిఎం తో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, ఎంఎల్‌సి తాతా మధు, సిఎస్ శాంతి కుమారి, సిపి సివి ఆనంద్‌లు కెసిఆర్ వెంట ఉన్నారు. అయితే నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.
సచివాలయాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ 30వ తేదీన, తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నాన్ని జూన్ 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీం తోపాటు ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రా రంభించే అవకాశం ఉన్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. తొలుత సచివాలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్‌లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్క్ తదితర పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సిఎం దానిపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
వర్క్ ఏజెన్సీ, మంత్రికి అభినందనలు
అనంతరం సిఎం చాంబర్ ఉండే ఆరో అంతస్తుకు సిఎం కెసిఆర్ చేరుకున్నారు. చాంబర్‌లో ఏర్పాటు చేసిన తదితర ఫర్నిచర్ గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. గత పర్యటనలో చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర పనులకు సంబంధించి తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి సిఎం కెసిఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను అభినందించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ చోటుచేసుకున్న గాలి వెలుతురుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సిఎం ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చాంబర్ లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సిఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నిచర్‌ను కెసిఆర్ తిలకించారు.
ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా కార్యాలయాలు
ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయా లేవా అని కెసిఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్‌ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్‌ను, సందర్శకుల కోసం వేచి ఉండే గదులను అందులోని సౌకర్యాలను సిఎం పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్ తదితర అవసరాల మల్టీపుల్‌గా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్‌ను సిఎం తిలకించారు. నలుమూలలా కలియతిరిగిన ముఖ్యమంత్రి సిఎం కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను, జిఎడి ప్రొటోకాల్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను సిఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, విఐపిల వెయిటింగ్ లాంజ్‌లను సిఎం చూశారు. మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ఆదేశించారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలు ఉండాలని కెసిఆర్ అధికారులకు సూచించారు.
పార్కింగ్ పనుల పరిశీలన
అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకున్న సిఎం భాగం మీదుగా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో ఉన్న పార్కింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వర్క్ ఏజెన్సీలు, ఇంజినీర్లకు సిఎం కొన్ని సూచనలు చేశారు. అక్కడి నుంచి సచివాలయం ప్రహరీకి అంతర్గతంగా ఉన్న, బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న రోడ్లు, సచివాలయం ముందునుంచి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంకుబండు మీదుగా వెళ్లే మార్గాన్ని కెసిఆర్ పరిశీలించారు. ఫ్లై ఓవర్ నుంచి, సచివాలయం ముందునుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు విశాలంగా నిర్మాణంలో రోడ్ల గురించి, సెక్రటేరియట్ లోపలకు వెళ్లే ప్రధానమార్గాన్ని పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతితో పాటు తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు సిఎం సంతోషం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిలో లోటు రావద్దు: కెసిఆర్
అనంతరం డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ పరిశీలించారు. అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సిఎం కెసిఆర్ అంబేద్కర్ విగ్రహం బేస్‌లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్లు ఆడియో విజువల్ ప్రదర్శన కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను, వర్క్ ఏజెన్సీలతో కెసిఆర్ స్పష్టం చేశారు. డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.
అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల పురోగతి
అక్కడినుంచి అమరవీరుల స్థూపం నిర్మాణ పనుల పురోగతిని సిఎం కెసిఆర్ పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం, లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులు, నిర్మాణ పురోగతిని ఇంజినీర్లు మ్యాపుల ద్వారా సిఎంకు ఇంజనీర్లు వివరించారు. పనుల గురించి సంతృప్తిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు.
సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సచివాలయం ప్రారంభం
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబిం చేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో దీని నిర్మాణం చేపట్టారు. ఇక జూన్ 2న తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం ప్రారంభించనున్నారు. జూన్ 1న మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించనున్నారు.
మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో..
ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేదీ 2019న నూతన సచివాలయ భవన నిర్మాణానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోపే సచివాలయం నిర్మాణం పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ.610 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. నూతన సచివాలయం చూడగానే నిజాం కాలం నాటి కట్టడాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఈ డిజైన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దశాబ్దాల కాలం పాటు నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ ఉండటంతో అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక హంగులతో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించారు. మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయం రూపొందించారు. రూఫ్ టాప్‌లో స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణగా, ఆహ్లాదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పటిష్టమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా
అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక వసతులతో ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నూతన సచివాలయ భవనాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ముందుగా సిఎం భావించినా, అప్పటికీ కాలేదు. దాంతోపాటు బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం లాంటివి సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడేందుకు కారణమయ్యాయి. ఆ తర్వాత సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినా ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, తాజాగా ఎన్నికల కోడ్ కారణంగా రెండోసారి దీని ప్రారంభోత్సవం వాయిదా పడింది.