హైదరాబాద్: ఆర్‌టిసి యూనియన్ నేత రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు ఆందోళనకు దిగిన సంఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతం హస్తినాపురం డివిజన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం…. మిర్యాలగూడకు చెందిన పావని, 2023 మే నెలలో ఆర్‌టిసి యూనియన్ నేత రాజిరెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి భార్యను భర్త వేదింపులకు గురి చేశాడు. అదనపు కట్నం తీసుకరావాలని పలుమార్లు వేధించాడు.
కుల పెద్దల సమక్షంలో మాట్లాడిన సమస్యకు పరిష్కారం దొరకలేదు. తనకు న్యాయం చేయాలని పుట్టింటి కుటుంబ సభ్యులతో కలిసి రాజిరెడ్డి ఇంటి ముందు పావని ధర్నాకు దిగింది. కుల పెద్దలు, మధ్యవర్తుల సహాయంతో ఆమె ఆందోళన విరమించింది. ఈ సందర్భంగా పావని మీడియాతో మాట్లాడారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వివరణ ఇచ్చారు. ఇది తమ కుటుంబ సమస్య అని, మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని ఆర్‌టిసి యూనియన్ లీడర్ రాజిరెడ్డి మీడియాకు తెలిపారు.