హైదరాబాద్: మా నాన్న హత్య వెనుక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ లు ఉన్నారని సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి కూతురు ఆరోపణలు చేశారు. మా నాన్న కాళేశ్వరం మీద కేసు వేశారని, ఆ కేసు తీర్పు మాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని, దీన్ని జీర్ణించుకోలేక తన నాన్నను చంపించారని రాజలింగమూర్తి కూతురు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్ రావుపై నాగవెళ్లి రాజలింగమూర్తి భార్య సంచలన ఆరోపణ చేశారు. తన భర్తను చంపింది బిఆర్ఎస్ గుండాలేనని మండిపడ్డారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని కేసు వేసామని, ఈ కేసు గెలుస్తామని పలుమార్లు తన భర్త తనతో చెప్పారన్నారు. 10 లక్షలు ఇస్తామని కేసు నుంచి తప్పుకోవాలని తన భర్తను బిఆర్ఎస్ నాయకులు బెదిరించారని చెప్పారు. తన భర్త హత్య వెనుక బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంఎల్ఎ గండ్ర వెంకట రమణారెడ్డి, హరిబాబు, ఏనుగుంట్ల కోమురయ్య, ఏనుగుంట్ల రవి, ఏనుగుంట్ల సంజీవులు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన భర్తను నడి రోడ్డు మీద పొడిచి చంపారన్నారు.