దుబాయి: కారణం చెప్పకుండానే తనను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తొలగించడంతో ఎంతో బాధపడ్డానని స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ అంటే తనకు ప్రాణమని అలాంటి జట్టులో తనకు అవమానం ఎదురు కావడాన్ని తట్టుకోలేక పోయానన్నాడు. ఏ కారణం చెప్పకుండానే కెప్టెన్సీ నుంచే కాక చివరికి తుది జట్టుకు కూడా దూరంగా ఉంచడాన్ని ఎంతో అవమానంగా భావించానన్నాడు. ఒకవేళ కారణం చెప్పి తొలగించి ఉంటే తాను పెద్దగా బాధ పడే వాడిని కాదన్నాడు. కానీ కావాలనే కొందరూ తనను ఘోరంగా అవమానించారని వార్నర్ వాపోయాడు. భవిష్యత్తులో మళ్లీ సన్‌రైజర్స్‌కు ఆడతానని తాను భావించడం లేదన్నాడు. ఆ జట్టుతో తన ప్రయాణం దాదాపు ముగిసినట్టేనని స్పష్టం చేశాడు. ఇక ప్రపంచకప్‌లో రాణించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. ఇక ఐపిఎల్ గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని వార్నర్ పేర్కొన్నాడు.