సిడ్నీ: ఐపిఎల్ మెగా వేలం పాటలో అనుకున్న దానికంటే తక్కువ ధరకు అమ్ముడు పోవడం ఏ మాత్రం నిరాశకు గురి చేయలేదని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తనను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. 2009 నుంచి 2013 వరకు తాను ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇక తనపై జట్టు యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానన్నాడు. ఇక సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్ తరఫున ఆడానని, ఈసారి కొత్త ఫ్రాంచైజీ తనను దక్కించుకుందన్నాడు. ఇది తనకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నాడు. మరోవైపు ఢిల్లీ అభిమానులకు చేరువవ్వడం కూడా ఆనందం కలిగిస్తుందన్నాడు. తనకు భారత్‌లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడినా వారు అండగా నిలుస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఇదిలావుండగా ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకు సొంతం చేసుకుంది. వేలం పాటలో కళ్లు చెదిరే ధర పలుకుతాడని భావించిన వార్నర్‌కు కాస్త నిరాశే మిగిలిందని చెప్పాలి.