Sunday, December 22, 2024

నేటి నుంచి దావోస్‌లో డబ్లుఇఎఫ్ భేటీ

- Advertisement -
- Advertisement -

దావోస్ : వార్షిక 54వ ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్లుఇఎఫ్) సదస్సు సోమవారం నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరుగుతాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పలు అంతర్జాతీయ స్థాయి కీలక క్లిష్ట సమస్యలు ఇందులో ప్రస్తావనకు వస్తాయి. భారత్, ఉక్రెయిన్,ఫ్రాన్స్ , చైనా వంటి పలు దేశాల నుంచి దాదాపు 2800 మందికి పైగా ప్రముఖ నేతలు ఈ భేటీకి హాజరవుతారు. వాతావరణ, పర్యావరణ అంశాలు, ఘర్షణలు, ఫేక్ న్యూస్ వంటి సమస్యలపై ఈ వేదిక ద్వారా పరిష్కారానికి చర్చలు జరుగుతాయి. దావోస్‌లోని అల్పైన్ రిసార్ట్ ఈ ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక అయింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ ఆలోచనల మేధోమథన వేదిక అవుతుందని ఆశిస్తున్నారు. సదస్సుకు 60 మందికి పైగా దేశాధినేతలు తరలివస్తున్నారు. భారతదేశం తరఫున కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ పూరి, ముగ్గురు సిఎంలు తెలంగాణకు చెందిన ఎ రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర నుంచి ఏక్‌నాథ్ షిండే, కర్నాటక నుంచి సిద్ధరామయ్య ఈ సదస్సుకు హాజరవుతారు.

జనవరి 15 నుంచి 19వరకూ ఈ సదస్సు నిర్వహిస్తారు. భారత్ తరఫున ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఉత్తరప్రదేశ్ మంత్రులు, వ్యాపార దిగ్గజాలు గౌతమ్ అదానీ, సంజీవ్ బజాజ్, కుమార మంగళం బిర్లా, ఎన్ చంద్రశేఖరన్, నదీర్ గోద్రేజ్, సజ్జన్ జిందాల్, రోషిణి నాడార్ మల్హోత్రా , నందని నిలేకని, రిషాద్ ప్రేమ్‌జీ, సుమంత్ సిన్హా వివిధ కంపెనీల సిఇఓలు కూడా వస్తున్నారు. ఇక ప్రపంచ స్థాయి నేతలలో ఫ్రెంచ్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, ఇయూ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్, ఉక్రెయిన్ అధ్యక్షులు వోల్డిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ , అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ వంటి వారు తరలిరానున్నారు. ఈ సదస్సులో ప్రత్యేకించి ఇప్పటికీ రగులుతున్న ఉక్రెయిన్ యుద్ధం, చల్లారని హమాస్, ఇజ్రాయెల్ ఘర్షణ వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. వీటి వల్ల అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్న ఇతరత్రా పర్యవసనాల గురించి కూడా చర్చలు జరుగుతాయి. మిడిలిస్టుకు చెందిన కీలక దేశాల విదేశాంగ మంత్రులు కూడా రానున్నారు.

దక్షణ కొరియా అధ్యక్షులు హన్ డక్ సూ , స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛేజ్ , స్విస్ ప్రెసిడెంట్ వియోలా అంహెర్డ్, బెల్జియం ప్రధాని , ఇరాక్ అధ్యక్షులు , నెదర్లాండ్స్, శ్రీలంక, వియత్నాంల దేశాధినేతలు కూడా రానుండటంతో ఈభేటీ విస్తృతస్థాయి ప్రపంచ వేదికగా మారుతోంది. ఐరాస జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గుటెర్రస్, ఐఎంఎఫ్ ఎండి క్రిస్టాలినా, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ ఎస్ బంగా, నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గెబ్రెయెసస్ కూడా హాజరుకానుండటంతో పలు ఆర్థిక కీలక విషయాలపై సమగ్ర చర్చకు వీలేర్పడుతుంది. 800కు పైగా ప్రపంచ ప్రముఖ స్థాయి సిఇఒలు, ఛైర్‌పర్సన్స్ కూడా వస్తారు. టెక్ దిగ్గజాలు, యునికార్న్, 35 మందికి పైగా సాంస్కృతిక విశిష్టులు కూడా తరలిరానున్నారు.

ప్రపంచ స్థాయి పరిణామాలపై ప్రధాన దృష్టి
సదస్సు నేపథ్యంలో సమాఖ్య నేత క్లాస్ స్కాబ్
ఈ సదస్సు ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో దావోస్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సు అత్యంత కీలకమైనదని ఆర్థిక సమాఖ్య వ్యవస్థాపకులు, కార్యనిర్వాహక ఛైర్మన్ క్లాస్ స్కాబ్ తెలిపారు. అనివార్యంగా ప్రపంచ స్థాయిలో భాగస్వామ్యాలు కుదిరితీరాల్సిందే. ఆర్థిక పురోగతి, క్లెమెట్, ప్రకృతి వైపరీత్యాలు, ఇంధన భద్రత , టెక్నాలజీ సంబంధిత పాలనా వ్యవస్థ, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాలలో తప్పనిసరిగా కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉందని క్లాస్ తెలిపారు. ఇప్పుడు విభజిత ప్రపంచం ప్రధాన సమస్య అవుతోంది. సామాజిక వ్యత్యాసాలు చివరికి అనిశ్చితతకు, నిరాశకు దారితీస్తున్నాయి. వీటికి ఎక్కడో ఓ చోట అడ్డుకట్ట పడాల్సి ఉంది. మన భవిత పట్ల మనం విశ్వాసం పాదుకునేలా చేయడం అవసరం, సమస్యలు వచ్చినప్పుడే స్పందించడం కాకుండా , వీటి నివారణకు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని తెలిపారు. నిర్వహణ సామర్థం పెరగాల్సి ఉంది. కలిసికట్టుతనంతోనే ఉజ్వలమైన లేదా ఆశాజనకమైన భవితను తీర్చిదిద్దుకునే వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News