Monday, December 23, 2024

కరాచీలో కుటుంబంతో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం

- Advertisement -
- Advertisement -

ముంబయి: భారత్ విడిచి పారిపోయిన డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ మహిళను ద్వితియ వివాహం చేసుకున్నాడు. దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు దావూద్ మేనల్లుడు అలీషా తెలిపాడు. మొదటి భార్యకు విడాకులిచ్చినట్లు దావూద్ అబద్ధం చెప్పి ద్వితీయ వివాహం చేసుకున్నట్లు పార్కర్ తెలిపాడు. దావూద్ ఇబ్రహీం సోదరి లేడీ డాన్ హసీనా పార్కర్ కుమారుడే అలీషా దావూద్ నేతృత్వంలోని క్రిమినల్ సిండికేట్ డికంపెనీ భారత్‌లో అనేక నేర కార్యకలాపాలు, ఉగ్రదాడులకు పాల్పడింది. డి కంపెనీ పాల్పడిన ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఎ విచారిస్తోంది. ఈక్రమంలో అలీషా స్టేట్‌మెంట్‌ను ఎన్‌ఐఎ చార్జ్‌షీట్‌లో నమోదు చేసి గతేడాది నవంబర్‌లో న్యాయస్థానంలో దాఖలు చేసింది. దావూద్ ఇబ్రహీం కస్కర్ భార్యపేరు మైజాబిన్..వీరికి కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. దావూద్ తన కుమార్తె మారుక్‌ను పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారుడు జునాయిద్‌కు ఇచ్చి వివాహం చేశాడు.

రెండో కుమార్తె మెహరిన్‌కు కూడా వివాహం కాగా మూడో కుమార్తె ఇంకా వివాహం కాలేదు. దావూద్ కుమారుడు మొహిన్ నవాజ్‌కు కూడా వివాహమైందని అలీషా పార్కర్ ఎన్‌ఐఎకి తెలిపాడు. దావూద్ పాకిస్థాన్ మహిళ పఠాన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులిచ్చినట్లు తెలిపాడు. కానీ వాస్తవం కాదు. దావూద్ ప్రస్తుతం అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా ఉన్న డిఫెన్స్ ఏరియాలో తన కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు పార్కర్ ఎన్‌ఐఎకు వెల్లడించాడు. కాగా భారత్‌లో డి కంపెనీ ఉగ్ర కార్యకలాపాలకు సహకరించేందుకు భారీ మొత్తంలో నగదును హవాలా మార్గంలో నిందితుడికి పంపినట్లు ఎన్‌ఐఎ అధికారులు చార్జ్‌షీట్‌లో ఆరోపించారు. ముంబయితోపాటు దేశంలోని పలుప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నారని, భారతదేశంలోని ప్రముఖులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై దాడులకు డి కంపెనీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. చార్జ్‌షీట్‌లో దావూద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు చోటా షకీల్ పేరును కూడా పేర్కొన్నారు. ఈ కేసులో ముంబయికి చెందిన అరీఫ్ అబుబాకర్ షేక్, షబ్బీర్ అబుబాకర్ షేక్, మొహమ్మద్ సలీమ్ ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News