నేడు ఢిల్లీతో కీలక పోరు
ముంబై: ఐపిఎల్‌లో వరుస ఓటములు చవిచూస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరు చావోరేవోగా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకున్న ముంబై కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఖాతా తెరవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకోవడం ముం బైకి అతిపెద్ద ఊరటగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో సూర్య బరిలోకి దిగితే ముంబై బ్యాటింగ్ సమస్య చాలా వరకు తీరిపోతుంది. మరోవైపు ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైం ది.
ఈ సీజన్‌లో ఢిల్లీ కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటి వరకు నాలు గు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ 106 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఇ లాంటి స్థితిలో ముంబైతో జరిగే మ్యాచ్ ఢిల్లీకి కూడా పరీక్షగా మారింది. రెండు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో విజయం ఎవరికీ వరిస్తోందో ఆసక్తి రేకెత్తిస్తోంది.
పరీక్షలాంటిదే..
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. కిందటి సీజన్‌లో గుజరాత్ జయపథంలో నడిపించిన హార్దిక్ ముంబై సారథిగా మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. అతని సారథ్యంలో ముంబై ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో హార్దిక్‌ను తప్పించి తిరిగి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంది. మాజీ క్రికెటర్లు కొందరూ హార్దిక్‌కు అండగా నిలుస్తుండగా, మరికొందరూ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి స్థితిలో హార్దిక్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై పెద్దగా ప్రభావం చూపలేక పోతోంది. రాజస్థాన్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధిర్, డెవాల్డ్ బ్రేవిస్ తదితరులు అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. ఇషాన్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. నమన్ ధిర్ ఇప్పటి వరకు ఆడిన అన్నీ మ్యాచుల్లోనూ నిరాశే మిగిల్చాడు.
బ్రేవిస్ కూడా తేలిపోతున్నాడు. ఇలాంటి స్థితిలో ముంబైకి వరుస ఓటములు తప్పడం లేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ముంబై మెరుగైన ఆటను కనబరచాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరో ఓటమి ఖాయం. ఇక ఢిల్లీకి కూడా విజయం చాలా కీలకంగా మారింది. డేవిడ్ వార్నర్, పృథ్వీషా, మిఛెల్ మార్ష్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అయితే జట్టు బ్యాటింగ్‌లో నిలకడగా లోపించడం సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆ లోపాన్ని సరిదిద్దు కుంటే ముంబైని ఓడించడం ఢిల్లీకి కష్టమేమీ కాదనే చెప్పాలి.