Sunday, January 19, 2025

నేడు రాజస్థాన్‌తో ఢిల్లీ కీలక పోరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదుంది. పది మ్యాచుల్లో 8 పోటీల్లో గెలిచి దాదాపు ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ అధికారికంగా నాకౌట్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచుల్లో ఐదింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ రేసులో నిలువాలనే పట్టుదలతో ఉంది. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి ఎదురైంది.

బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ ఈ మ్యాచ్‌లో 153 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ ఉంచిన లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. కాగా, ఓపెనర్ పృథ్వీ షా, షాయ్ హోప్, అభిషేక్ పొరెల్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టును వెంటాడుతోంది. పృథ్వీషాకు వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. పొరెల్‌ది కూడా ఇదే పరిస్థితి. హోప్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా కీలక ఆటగాళ్లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు కీలకంగా మారాడు. ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ తదితరులు కూడా బ్యాట్‌ను ఝులిపించక తప్పదు.

అప్పుడే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. మరోవైపు రాజస్థాన్ హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, పొవెల్, ధ్రువ్ జురెల్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. యశస్వి, బట్లర్, పరాగ్, కెప్టెన్ శాంసన్‌లు ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు సానుకూల అంశంగా చెప్పాలి. బౌలింగ్‌లో కూడా రాజస్థాన్ సమతూకంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News