Friday, November 22, 2024

ఢోకాలేని టీకాలు

- Advertisement -
- Advertisement -

కరోనాపై కదనంలో జంటయోధులకు అనుమతి

తగిన పరీక్షలు జరిపిన తర్వాతే నిపుణుల కమిటీ సిఫారసు మేరకు అనుమతులు మంజూరు చేశాం : డిసిజిఐ
కొవిషీల్డ్‌ను రూపొందించిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా
ఐసిఎంఆర్, పుణె, ఎన్‌ఐవి సహకారంతో తయారైన కొవాగ్జిన్, సీరం కృషికి ఫలితం దక్కింది: పునావాలా
శుభపరిణామం : ఎయిమ్స్ డైరెక్టర్
జంట టీకాలకు స్వాగతం : డబ్లుహెచ్‌ఒ
కొవిన్ యాప్ ద్వారా పంపిణీ : కేంద్ర ఆరోగ్యశాఖ

DCGI approval Covishield and covaxin for emergency use

న్యూఢిల్లీ/పుణె: కొవిడ్ నిరోధానికి దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస(డిసిజిఐ) వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ టీకా భద్రమైందని ఇప్పటికే నిరూపితమైందని వెల్లడించింది. ఐసిఎంఆర్, పుణె ఎన్‌ఐవి సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే ఆక్స్‌ఫర్డ్‌ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కూడా డిసిజిఐ ఆమోదముద్ర వేసింది. కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త రకాలు విజృంభిస్తున్న తరుణంలో డిసిజిఐనుంచి ఈ ప్రకటన రావడం ఎతో ఊరట కల్పించే అంశం. ‘తగిన పరీక్షలు నిర్వహించిన తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సులను ఆమోదించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) నిర్ణయించిందని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా( డిసిజిఐ) డాక్టర్ విజి సోమని మీడియాకు చెప్పారు. ప్రపంచం లో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత దేశం సిద్ధమవుతున్న తరుణంలో వ్యాక్సిన్లపై వస్తున్న వదంతులను డిసిజిఐ తోసిపుచ్చారు. కొవిడ్19 వ్యాక్సిన్లు తీసుకుంటే నపుంసకత్వం వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అర్థరహితమని ఆయన అన్నారు. భద్రతాపరంగా కనీసం అత్యంత సూక్ష్మమైన ఆందోళనకరమైన అంశం ఉన్నా తాము ఎట్టిపరిస్థితుల్లోను ఆమోదం తెలపబోమని చెప్పారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు నూటికి 110 శాతం సురక్షితమైనవని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్‌కైనా స్వల్ప జ్వరం, నొప్పి అలర్జీ వంటి సైడ్ ఎఫెక్ట్ సాధారణమేనని అన్నారు.

వ్యాక్సినేషన్ వల్ల నపుంసకత్వం వస్తుందంటూ జరుగుతున్న ప్రచారమంతా పూర్తిగా అర్థరహితమన్నారు. ఈవ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సోమని వివరించారు. అంతకు ముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని డిసిజిఐ ఔషధ ప్రమాణాలనియంత్రణ సంస ్థ(సిడిఎస్‌సిఓ)సిఫార్సు చేసింది. దానికి అనుగుణంగా ఆదివారం డిసిజిఐ తు ది అనుమతులు మంజూరు చేసింది. డిసిజిఐ ప్రకారం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు టీకాలకే ఇప్పటివరకు అనుమతి లభించింది. వీటితో పాటుగా క్యాడిల్లా హెల్త్ కేర్ కూడా టీకాను అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు టీకాలు కూడా 2 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయవచ్చని సోమని చెప్పారు.
భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్)కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన సార్స్‌కోవ్2 స్ట్రెయిన్ తో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్.. ఇన్‌యాక్టివేటెడ్ రకానికి చెందిన టీకా. వ్యాధికారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేయడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఫలితంగా ఈ జీవికి పునరుత్పత్తి సామర్థం ఉండదు. కానీ టీకా తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని గుర్తించగలిగి వాటిపై ప్రతిస్పందన చర్యలను కలిగించే స్థాయిలో అది ఉంటుంది. హెపటైటిస్‌ఎ, ఇన్‌ఫ్లూయెంజా, పోలియో, రేబీస్ వంటి అనుక వ్యాధులకు ఇన్‌యాక్టివేటెడ్ టీకాలనే ఇస్తున్నారు.
కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు
ప్రతి భారతీయుడికీ గర్వకారణం: మోడీ
భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌పై యుద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు డిసిజిఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడపై ప్రధాని స్పందించారు.ఈ నిర్ణయం భారత్ ఆరోగ్యవంతమైన, కొవిడ్ రహిత దేశంగా మారేందుకు సహకరిస్తుందన్నారు. .దేశ ప్రజలకు, వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారైనవి కావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ప్రధాని అన్నారు. శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు ఈ ఘటన ఉదాహరణ అన్నారు. ‘మన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, ఇతర కరోనా వారియర్స్ దేశ కష్టకాలంలో చేసిన సేవలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి రుణపడి ఉన్నాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
సీరం కృషికి ఫలితం దక్కింది: పూనావాలా
ఆక్స్‌ఫర్డ్‌ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా రాబోయే కొద్దివారాల్లోనే అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉందని మన దేశంలోఈ టీకాను ఉత్పత్తి చేస్తున్న పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఓ అదర్ పూనావాలా తెలిపారు. కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి డిసిజిఐ ఆదివారం అనుమతి ఇచ్చిన వెంటనే పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యాక్సిన్ తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్ తీసుకున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. భారత్‌లో తొలి కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ వినియోగానికి అనుమతి లభించింది.సురక్షితమైన, సమర్థవంతమైన ఈ టీకా రానున్న కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది’ అని పూనావాలా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఈ కృషితో తమకు మద్దతు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకాతో సహా అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
శుభపరిణామం: ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా కట్టడిలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు డిసిజిఐ అనుమతి ఇవ్వడం గొప్ప శుభపరిణామమని ఢిల్లీ అఖిత భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)డైరెక్టర్ రణదీఫ్ గులేరియా వ్యాఖ్యానించారు. కొత్త సంవత్సరాన్ని విధంగా ప్రారంభించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. అతి త్వరలోనే దేశ ప్రజలకు టీకాను ఇవ్వడం ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. కాగా మూడో దశ ట్రయల్స్ పూర్తికాకముందే భారత్ బయోటెక్ తయారీ కొవాగ్జిన్ టీకాకు అనుమతులు ఇవ్వడంపై వ్యక్తమవుతున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ప్రస్తుతానికి కొవాగ్జిన్ బ్యాకప్ వ్యాక్సిన్‌గానే ఉంటుందని అన్నారు. ఒక వేళ బ్రిటన్ కరోనా వైరస్ వేరియంట్ తీవ్రరూపం దాలిస్తే అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ వాడుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వద్ద 5 కోట్ల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని, తొలి కొన్ని వారాలు పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మాత్రమే ఇస్తారని, అప్పటికల్లా భారత్ బయోటెక్ మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకుని తమ వ్యాక్సిన్ భద్రత, సమర్థతపై మరింత డేటాను చూపించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

DCGI approval Covishield and covaxin for emergency use

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News