న్యూఢిల్లీ: సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డిసిజిఐ)నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ధ్రువీకరించారు. భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌కు డిసిజిఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. దేశంలో అనుమతి లభించిన తొమ్మిదో వ్యాక్సిన్ ఇది. మహమ్మారిపై దేశం జరుపుతున్న ఉమ్మడి పోరాటాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది’ అని మన్‌సుఖ్ మాండవీయ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. బూస్టర్ డోస్‌గా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను అనుమతించాలని డిసిజిఐని కోరినట్లు దేశంలో ఈ డ్రగ్ తయారీకి అనుమతి పొందినహైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ఇంతకుముందు తెలిపింది. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి గత ఏడాది ఏప్రిల్‌లో డాక్టర్ రెడ్డీస్‌కు కేంద్రం అనుమతి ఇచిన విషయం తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ ఈ వ్యాక్సిన్‌ను రష్యానుంచి దిగుమతి చేసుకునేది. అయితే ప్రస్తుతం దేశంలో స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు అంతగా డిమాండ్ లేదు.