Sunday, December 22, 2024

టీ స్టాల్‌లోకి దూసుకెళ్లిన డిసిఎం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్తున్న డిసిఎం వ్యాన్ గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని రాజీవ్ రహాదారి పక్కనే ఉన్న ఓ టీ స్టాల్‌లోకి అతివేగంగా దూసుకెళ్లింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతి వేగంతో మున్సిపల్ వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా పక్కనే ఉన్న టీ షాప్‌లోకి వ్యాన్ దూసుకెళ్లింది. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలు మినహా, ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రాంతం గోదావరిఖని బస్టాండ్ పక్కనే ఉండటం, నిత్యం రద్దీ ఉండే ప్రదేశం కావడం, అయితే ఈ ఘటన ఉదయం వేళ చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు.

ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం ఎంఎల్‌ఎ
జీవనోపాధి కోసం రోడ్డు పక్కనే షాపులు నిర్వహించుకుంటున్న వారికి నష్టం చేస్తూ అతివేగంతో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎంఎల్‌ఎ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కోరారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన బాధితులకు అన్నివిధాల ఆదుకునే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట మేయర్ బంగి అనిల్ కుమార్‌తో పాటు మున్సిపల్ కమిషనర్, అధికారులు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News