న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా రిడెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా నాలుగు స్థలాల వాడకంలో మార్పులను ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డిడిఎ) ప్రతిపాదించింది. ఈ నాలుగు ఖాళీ స్థలాలలో రెండు ప్రధానమంత్రి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినవి. మోతీలాల్ నెహ్రూ మార్గ్, కె కామరాజ్ మార్గ్(ప్లాట్ నం.38) మధ్య ఉన్న రెండు ప్లాట్లు, డాల్హౌసీ రోడ్డు, టూటూ రోడ్డు(ప్లాట్ నం.36) మధ్య ఉన్న రెండు ప్లాట్ల వాడకాన్ని రిక్రియేషన్(ఉద్యానవనాలు) నుంచి ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడానికి ప్రతిపాదిస్తూ డిడిఎ గత వారం బహిరంగ నోటీసు జారీచేసింది. 9.5 ఎకరాల చొప్పున ఉన్న ఈ రెండు ప్లాట్లలో ప్రధానమంత్రి కొత్త కార్యాలయం నిర్మాణం కానున్నది. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం, ఉమ్మడి సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు 3 కిలోమీటర్ల రోడ్డు పునర్మిర్మాణం, ప్రధానమంత్రి నూతన నివాసం, కార్యాలయం, ఉప రాష్ట్రపతి నూతన నివాసం నిర్మిస్తారు.