Wednesday, January 22, 2025

డిడిఎస్ వ్యవస్థాపకుడు పివి సతీష్ అస్తమయం

- Advertisement -
- Advertisement -

జీవవైవిద్యం కాపాడటానికి రాజీలేని పోరాటం
అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి
గ్రామీణ వ్యవసాయంపై మక్కు
మహిళల అభ్యున్నతికి తోడ్పాటు

ఝరసంగం: గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతూ మహిళలలో చైతన్యాన్ని నింపి చిరుధాన్యాల పంటలను పండించడంలో వారిని ప్రోత్సహిస్తూ సామాజిక సమతుల్యాన్ని పాటించాలని వారిలో మార్పు తేవడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఎన్జీవో ను స్థాపించి గ్రామీణ మహిళల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన డిడిఎస్ వ్యవస్థాపకుడు పీవీ సతీష్ (77)ఆదివారం ఉదయం అస్తమయం అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో 1945 జూన్ 18న పెరియాపట్నం వెంకటసుబ్బయ్య సతీష్ జన్మించినాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ఢిల్లీ నుండి మాస్ కమ్యూనికేషన్ లో పట్టభద్రుడైన ఆయన దూద్దర్శన్లో పని చేశారు.

దూరదర్శన్ లో పనిచేస్తున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ అభివృద్ధితో పాటు గ్రామీణ విద్యపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. 1980లో కొంతమంది స్నేహితులతో కలిసి మెట్ట ప్రాంతమైన జహీరాబాద్ లో దళిత మహిళల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి అభివృద్ధి కొరకు డిడిఎస్(ఎన్జీవోను) ప్రారంభించారు. అప్పటినుండి ఈ సంస్థ దళిత వర్గాలలో నిరుపేద మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి వారి ద్వారా చిరుధాన్యాలను పండించడం ప్రారంభించారు. వారికి చదువు విలువ తెలియపరుస్తూ చైతన్యవంతులను చేశారు. జెండర్ సమతుల్యత, సామాజిక బాధ్యతలు జీవవైవిద్యం కాపాడడంలో ఎనలేని కృషి చేశారు.

సంఘం మహిళలకు ఫోటోగ్రఫీలో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించారు. సంఘం రేడియోను నెలకొల్పి డిడిఎస్ నిర్వహించే పలు సామాజిక, వ్యవసాయ, జీవవైవిద్యం, చిరుధాన్యాల ఆవశ్యకత లపై ప్రజలకు వివరించారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను దేశం గుర్తించేలా సతీష్ చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణలో సుమారు 75 గ్రామాలలో డిడిఎస్ ద్వారా నిరుపేద దళిత మహిళల అభివృద్ధికి ఉపాధి అవకాశాలను కల్పించారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. అందులో భాగంగా మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (ఎంఐఎన్‌ఐ) సౌత్ అగినెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి సంస్థలను ప్రారంభించారు.

జెనెటిక్ రిసోర్స్ ఆక్షన్ ఇంటర్నేషనల్ లో ( జి ఆర్ ఏ ఐ ఎన్) లో సభ్యునిగా పనిచేశారు. చదువు లేని దళిత మహిళలతో భారతదేశ మొదటి కమ్యూనిటీ మీడియాను ప్రారంభించారు. దీని పేరు సంగం రేడియో అని పెట్టారు. ఎన్జీవో సెక్టార్ లో నీతికి,నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. విలువలకు విశ్వసనీయతకు నిబద్దతగా నిలబడి నేటి యువతరానికి ఆదర్శప్రాయుడయినాడు. సతీష్ ఇక లేరు అని డిడిఎస్ సిబ్బంది ,స్నేహితులు, వేల సంఖ్యలో మహిళరైతులు బాధతప్త హృదయాలతో విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో పస్తాపూర్ లోని డిడిఎస్ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News