మృత కాకికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద మరణించిన ఒక కాకి నమూనాను పరీక్షకు పంపగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో చారిత్రాత్మక ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడంపై ఆంక్షలు విధించినట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం ఎర్రకోట ప్రాంగణంలో సుమారు 15 కాకులు మరణించి పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. అందులో ఒక కాకికి చెందిన నమూనాను జలంధర్‌కు చెందిన ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్ అని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 26వ తేదీ వరకు ఎర్రకోట వద్ద సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్లు ఆయన చెప్పారు. కాగా..ఢిల్లీ జూకు చెందిన ఒక మృత గుడ్లగూబ నమూనాకు కూడా బర్డ్‌ఫ్లూ పాజిటివ్ అని శనివారం నిర్ధారణైంది.