నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ
963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు
గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ
డెడ్‌స్టోరేజికి చేరిన శ్రీశైలం
అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్
ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం
తుంగభద్రలో తేలిన ఇసుక తిన్నెలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎండలు ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు మండు వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. వేసవి సెగల ధాటికి ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీటిపై వేసవి అవసరాల దృష్టా పొదుపు చర్యలు తీసుకుంటుంటే ..మరోవైపు సెగలు చిమ్ముతున్న ఉష్ణోగ్రతల ధాటికి రిజర్వాయర్లలో నీటి అవిరి శాతం పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాడులుగా ఉన్న కృష్ణా, గోదావరి ,పెన్నా నదుల పరివాహకంగా ఉన్న 14 ప్రధాన జలాశయాల్లో నీటి నిలువలు రోజురోజుకు తరిగిపోతున్నాయి. ఈ జలాశయాల్లో గరిష్ట స్థాయి నీటినిలువల్లో 70శాతం పైగా ఖాళీ అయ్యాయి. వీటిలో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 963 టీఎంసీలు కాగా, ప్రస్తుతం వీటిలో నీటినిలువ 295టిఎంసీలకు పడిపోయింది.
గత ఏడాది వేసవిలో ఈ సమయానికి ఈ జలాశయాల్లో 511టిఎంసీల నీరు నిలువ ఉండేది. గత ఏడాదితో పోలిస్తే వీటిలో నీటినిలువలు 216టిఎంసీలు తక్కువగా ఉన్నాయి. కృష్ణానది పరివాహకంగా ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఊస్సూరుమనిపిస్తోంది. రాష్ట్ర ముఖద్వారాంలో ఉన్న జూరాల జలాశయం రోజురోజుకు అడుగంటుతోంది. ఈ జలాశయంలో గరిష్టస్థాయి 9.66టిఎంసీలకు గాను ప్రస్తుతం 3.48టిఎంసీల నీరు నిలువ ఉంది. శ్రీశైలం జలాశయం మరింతగా అడుగంటిపోయింది. 215టీఎంసీల పూర్తి స్థాయి నీటినిల్వ సామర్ధం ఉన్న ఈ జలాశయంలో నీటినిలువ 34టిఎంసీలకు తరిగిపోయింది. నీటిమట్టం కూడా 810అడుగుల డెడ్ స్టోరేజికి చేరుకుంది. గత ఏడాది ఈ జలాశయంలో నీటినిలువ ఈ సమయానికి 821అడుగుల వద్ద 41టిఎంసీల నీరు నిలువ ఉండేది. గత ఏడాదితో పోలిస్తే ఏడు టీఎంసీలు తక్కువగాఉంది. జలాశయంలో 179టీఎంసీల ఖాళీ ఏర్పడింది. దిగువన నాగార్జునసాగర్‌లో నీటిమట్టం మరింత వేగంగా తరిగి పోతోంది.
సాగర్ జలాశయం విస్తరణ పరిధి అధికంగా ఉండటంతో ఎండల తీవ్రతకు నీటి అవిరి శాతం పెరుగూతూ వస్తోంది. జలాశయంలో 312టీఎంసీల గరిష్ట నీటినిలువ సామర్దానికిగాను ప్రస్తుతం ఇందులో 139టిఎంసీల నీరు నిలువ ఉంది.నీటిమట్టం 513అడుగులకు చేరింది. మరో మూడు అడుగులు ఖాళీ అయితే ఇక సాగర్ జలాశయంలో నీటినిల్వ డెడ్‌స్టోరేజికి పడిపోనుంది. గత ఏడాది ఇందులో ఈ సమయానికి 191టిఎంసీల నీరు నిలువ ఉండేది. ఈ సారి 52టిఎంసీల నీరు తక్కువగా ఉంది. జలాశయం 172టీఎంసీల మేరకు ఖాళీ ఏర్పడింది. దిగువన ఉన్న పులిచింతల జలాశయాన్నికూడా ఏడా పేడా తోడేశారు. ఇందులో నీటినిల్వ 4.70టిఎంసీలకు పడిపోయింది. గరిష్ఠస్థాయి 45టిఎంసీల నిల్వ సామర్దం ఉన్న ఈ జలాశయంలో గత ఏడాది ఈ సమయానికి 42టిఎంసీల నీరు నిలువ ఉండేది. ప్రకాశం బ్యారేజి కింద ఏపిలో అవసరాల పేరుతో పులిచింతల నుంచి 40టిఎంసీల నీటిని తోడేశారు. కృష్ణాకు ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభధ్ర నదీ ఇసుక తిన్నెలు తేలి ఎడారిని తలపిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టులో పూర్తి స్థాయి 105టిఎంసీల నిలువ సమార్ధానికిగాను ప్రస్తుతం ఇందులో 5టిఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది ఈ సమయానికి ఇందులో 23టిఎంసీలు నిలువ వుండేవి. ఈ ఏడాది మొత్తంగా తుంగభద్ర నదిద్వారా తెలుగు రాష్ట్రాలకు 20టిఎంసీలకు మించి దక్కలేదు.
శ్రీరాంసాగర్ 80శాతం ఖాళీ!
గోదావరి నదిపరివాహకంగా జలాశయాలపై ఈ వేసవిలో మేడిగడ్డ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. మేడిగడ్డ నుంచి ప్రాణహిత నదీజలాల ఎత్తిపోత ఆగిపోయవటంతో ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ జలాశయంపైన నీటి వత్తిడి పెరిగిపోయింది. దీంతో శ్రీరాం సాగర్ జలాశయం ఇప్పటికే 80శాతం ఖాళీ అయిపోయింది. 90టీఎంసీల గరిష్ట నీటినిలువ సామర్ధం ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం 17టిఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గత ఏడాది ఈ సమయానికి ఇందులో 40టీఎంసీల మేరకు నీరు నిలువ ఉండేది. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 20టీఎంసీల గరిష్ట నీటినిలువ సామర్ధానికిగాను ఇందులో 8.72టిఎంసీల నీరు మిగిలివుంది. గత ఏడాది ఎల్లంపల్లిలో 17టిఎంసీల నీరు నిలువ వుండేది.
నిజాంసాగర్‌లో 7టిఎంసీలు, సింగూరులో 20,కడెంలో 3, లోయర్‌మానేరులో 7, మిడ్‌మానేరులో12టీఎంసీల నీరు మిగిలివుంది. ఏపిలో ఉన్న వెలుగోడు రిజర్వాయర్‌లో 16టీఎంసీల గరిష్టస్థాయికిగాను 1.50టిఎంసీల నీరు నిలువ ఉంది.పెన్నానది పరివాహకంగా సోమశిలలో కూడా 77టిఎంసీల పూర్తి స్థాయి నీటినిలు సామర్దానికిగాను 14టిఎంసీల నీరు మిగిలివుంది. గత ఏడా ఈ జలాశయంలో ఈ సమయానికి 58టిఎంసీల నీరు నిలువ ఉండేది. కండలేరులో కూడా 68టిఎంసీల పూర్తి స్థాయి నిలువ సామర్దానికిగాను 9టిఎంసీలు మాత్రమే మిగిలివుంది. గత ఏడాది ఈ సమయానికి ఇందులో 43టిఎంసీలు నిలువ ఉండేది.