మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పించింది. అర్హత గల విద్యార్థులు ఈ నెల 27వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు స్వీకరణ కొనసాగుతుంది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించొచ్చు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని బోర్డు తెలిపింది. రూ.100 ఆలస్యం రుసుంతో డిసెంబర్ 6 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.అలాగే రూ.వెయ్యి అపరాధ రుసుంతో వచ్చే నెల 17 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో వచ్చే నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు రూ.500, ఒకేషనల్ కోర్సులకు రూ.710 ఫీజు చెల్లించాలి. అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం ఆర్ట్ విద్యార్థులకు రూ.500, సైన్స్ విద్యార్థులకు రూ.710, ఒకేషనల్ విద్యార్థులకు రూ.710 ఫీజు చెల్లించాలి.