ఇప్పటివరకు సిద్దంకాని పుస్తకాలు, దుస్తులు
మనబడి కార్యక్రమం కింద సాగుతున్న పనులు
టీచర్లు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
ఇంగ్లీషు మీడియంతో విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్న ఉపాధ్యాయులు
హైదరాబాద్: నగరంలో పాఠశాలలు పునః ప్రారంభానికి మూడు రోజులు సమయం ఉన్నా ఇప్పటివరకు పుస్తకాలు, దుస్తులు చేరలేదు. కొత్తగా ఆంగ్ల మాధ్యమంలో తరగతులు ప్రారంభిస్తున్న టీచర్ల శిక్షణ సగం మందికే పూర్తి కాలేదు. ఉపాధ్యాయులు బడిబాట ప్రచారం కార్యక్రమంలో ఉండగా మరో వైపు మనబస్తీ, మనబడి కార్యక్రమం కింది మరమ్మత్తులు చేపడుతున్న ఇప్పటివరకు పనులు పూర్తికాలేదు. సోమవారం నుంచి పాఠశాలలకు విద్యార్ధులు వస్తే తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడంతో పరిస్దితి ఏమిటని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. వీటికి తోడు ఉపాధ్యాయ, నాన్‌టీచింగ్ సిబ్బంది కొరత స్కూళ్ల వెకిరిస్తుంది. జోనల్ బదిలీ చాలా టీచర్లు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు బోధించడం కష్టమనే పరిస్దితులు వస్తాయని అంటున్నారు. ఈవిద్యాసంవత్సరంలో అన్ని స్కూళ్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధించేందుకు ప్రణాళికలు చేశారు.
మూడు నెలలుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా బోధించేందుకు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 1.10లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి మరో 20శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా ప్రైవేటు స్కూళ్లు 1745 ఉండగా వాటిలో 7.50లక్షల మంది చదువుతున్నట్లు విద్యాశాఖ పేర్కొంటున్నారు. వీరిలో చాలామంది చిన్నారులు యాజమాన్యాల ఫీజుల వేధింపులకు సర్కార్ బడి బాట పట్టేందుకు తల్లిదండ్రులు సమీపంలో ఉన్న స్కూళ్ల వద్దకు వచ్చి ఆడ్మిషన్లు తీసుకునేందుకు వివరాలు తెలుసుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గడిచిన ఏడాదిలో విద్యార్థులకు మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారని, ఈసారి అలాంటి పరిస్దితులు రాకుండా ఉండేందుకు ఐదారు రోజుల నుంచి జిల్లా అధికారులు పాఠశాలలను తనిఖీ చేస్తూ వీలైనంత త్వరగా మనబడి కార్యక్రమం పనులు చేయాలని సూచనలు చేస్తున్నారు.
అదే విధంగా సిబ్బంది విషయంలో కూడా ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు కావాల్సిన టీచర్లు, స్వీపర్లు, అటెండర్ల జాబితా పంపినట్లు, తక్కువ ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యా వాలంటీర్లు పెంపు, కింది స్దాయి సిబ్బంది విషయంలో ప్రైవేటు వ్యక్తులను తీసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అదే విధంగా విద్యాకమిటీలు కూడా త్వరలో పూర్తి చేసి, విద్యార్థులకు సమస్యలు తెలుసుకుని వారికి కావాల్సినవి దాతల ద్వారా సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ తరహా విద్యా ప్రమాణాలు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తమ పిల్లలను సర్కార్ స్కూళ్లో చేర్పించాలని కోరుతున్నారు.