Saturday, November 23, 2024

డియర్ మోడీ సర్కార్..ఏమిటీ పని?: ఫోన్ల హ్యాకింగ్‌పై విపక్ష ఎంపీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని యాపిల్ కంపెనీ తమకు హెచ్చరిక సందేశాలు పంపినట్లు నలుగురు ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రకటిస్తూ తమ ఎక్స్(పూర్వ ట్విట్టర్) హ్యాండిల్స్‌పై ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్ర, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)కు చెందిన ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ పార్టీ ఎంపి శశి థరూర్, ఆ పార్టీ మీడియా, పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా తమ ఎక్స్ హ్యాండిల్స్‌పై స్క్రీన్‌షాట్లను షేర్ చేశారు.

తన ఐఫోన్‌ను హ్యాక్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ యాపిల్ నుంచి తనకు హెచ్చరిక మెసేజ్, ఈమెయిల్ వచ్చాయని, మీ భయం చూసి జాలివస్తోందంటూ పిఎంఓ ఇండియా, అదానీలను ట్యాగ్ చేస్తూ మహువా మొయిత్రా వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన మరో ముగ్గురు నాయకులకు కూడా ఇవే సందేశాలు వచ్చాయని ఆమె తెలిపారు.
ప్రియాంక చతుర్వేది కూడా తనకు యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ చేశారు. షేమ్ ఆన్ యు అంటూ కేంద్ర హోంమంత్రిత్విశాఖను ఆమె ట్యాగ్ చేశారు.

కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా కూడా తనకు యాపిల్ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌పై స్పందించారు. తన కింద పనిచేసే ఉద్యోగులను ఈ రకంగా పనికల్పించడం సంతోషమని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యంగ్యబాణాలు విసిరారు. ఇంతకన్నా వేరే ముఖ్యమైన పనేమీ లేదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. డియర్ మోడీ సర్కార్..ఎందుకు ఈ పని చేస్తున్నారు అంటూ పవన్ ఖేరా ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News