Sunday, December 22, 2024

బీమా కోసం చావు డ్రామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/టేక్మాల్: మెదక్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్‌లో కారు దగ్ధ్దమై వ్యక్తి సజీవ దహనమైన సంఘటనలో ఊహించని ట్విస్ట్‌తో కూడిన సంచలన విషయాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూశాయి. ఈనెల 9వ తేదీ సోమవారం తెల్లవారుజామున వెంకటాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్న ఈ సంఘట న రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సంఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. మొదట్లో మండలంలోని భీమ్లా తండాకు చెందిన పాతులోత్ ధర్మానాయక్(48)గా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే పోలీసుల దర్యాప్తులో కారులో దహనమైన బాడీ ఈయన డ్రైవర్‌దని తేలింది. ధర్మానాయక్ మొదట్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేరి, అనంతరం గ్రూప్స్ రాసి హైదరాబాద్ సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై ధర్మానాయక్ భార్య నీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఘటనపై పెద్దగా కంగారు పడని కుటుంబం కారు మంటల్లో దహనమై ఒక వ్యక్తి సజీవ దహనమైతే ఆ కుటుంబం ఎంతలా తల్లడిల్లిపోతుందో చెప్పలేం.. అయితే ధర్మా నాయక్ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఆ స్థాయిలో ఆందోళన కన్పించలేదంటున్నారు పోలీస్ వర్గాలు. ఘటన జరిగిన సమాచారం తెలిసినా.. సాయంత్రం అయినా ఘటనా స్థలికి రాకపోవడం.. సాయంత్రం వచ్చి వెనువెంటనే తూతూ మంత్రంగా అంత్యక్రియలు కానిచ్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టినా.. మొదట్లో పెద్దగా దృష్టి పెట్టలేదు.

తర్వాతర్వాత వారికి వచ్చిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులలకు కుటుంబ సభ్యుల నుంచి పొంతనలేని సమాధానాలురావడంతో ధర్మానాయక్ హిస్టరీని సైతం పోలీసులు సవాలుగా తీసుకొని ముందుకుసాగారు. అదే సందర్భంలో ధర్మానాయక్ కుటుంబానికి చెందిన కొంతమంది వ్యక్తులు పరారీలో ఉండటం కూడా పోలీసుల అనుమానాలకు తావిచ్చేదిగా కన్పించింది. దీంతో దర్యాప్తును సవాల్‌గా తీసుకుని ఎట్టకేలకు మృతుడు ధర్మానాయక్ కాదని తెలుసుకున్నారు. పూణేలో ఉన్నట్టు గుర్తించి ధర్మానాయక్‌ను పూణెలో పట్టుకున్నారు. ఈయనకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దగ్ధమైన కారువద్ద పెట్రోల్ బాటిల్

కాగా, ఈ ఘటనలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఘటన జరిగిన నాల్గవ రోజు భార్య నీలకు ధర్మనాయక్ ఫోన్ చేయడం.. ఆ నోటా.. ఈ నోటా పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అదే సందర్భంలో.. ఇన్సూరెన్స్ క్లయిం చేసుకోమని చెప్పడం కూడా బైటకొచ్చింది. ఈ విషయాన్ని ధృవీకరించుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. దాంతోపాటు ఘటనా స్థలాన్ని ప్రత్యక టీం పరిశీలించిన సందర్భంలో దహనమైన కారు సమీపంలో పెట్రోల్ బాటిల్ పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. ధర్మ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. ముందుగా ధర్మ బతికే ఉన్నాడని.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే ఒక బృందం అక్కడికి వెళ్లి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి తమదైనశైలిలో విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు. ధర్మ బెట్టింగ్‌లు ఆడి అప్పుల పాలయ్యాడని.. బీమా సొమ్ములు వస్తే అప్పులు తీర్చొచ్చని భావించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా డబ్బుల కోసమే ధర్మ ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. డ్రైవర్‌ను చంపి కారులో ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేడు పూర్తి వివరాలతో నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెడతామని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మిస్టరీని ఛేదించడం పట్ల పోలీసులను ప్రజలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News