Sunday, December 22, 2024

మామిడిపల్లి చౌరస్తా వద్ద యాచకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఒక యాచకుడి ప్రమాద మృతి కలకలం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారి దుశ్చర్యకు ఓ నిండు ప్రాణం బలైంది. మామిడిపల్లి చౌరస్తా వద్ద టిప్పర్ కింద పడి యాచకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మందుల సూరజ్ అలియాస్ శివరాం స్థానిక కూడలి వద్ద కారు అద్దాలను తుడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఒక ప్రభుత్వ అధికారి కారులో సిగ్నల్ వద్ద ఆగి ఉండగా కారు అద్దాలను తుడిచిన యాచకుడు సూరజ్ డబ్బులు అడిగే క్రమంలో ఆ అధికారి డబ్బులు లేవని సమాధానం చెప్పాడు. గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే ప్రభుత్వ అధికారి తన కారును ముందుకు కదలించాడు.

యాచకుడు డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టడంతో సదరు అధికారి కారు దిగి, కోపంతో ఊగిపోయి యాచకుడిని కాలితో తన్నాడు. ఈ క్రమంలో అటువైపు నుండి వస్తున్న టిప్పర్ కింద పడి మృతి చెందాడు. టీచర్స్ కాలనీలో ఉంటున్న మృతుడి అక్క మందుల మహ్వి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా సిసిటివి దృశ్యాలను పరిశీలించారు. కాలితో తన్ని ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రభుత్వ అధికారి అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఓ మండలానికి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ, టిఎన్‌జిఒ సంఘంలో ఒక పదవిలో ఉన్నట్లు సమాచారం. కాగా, శుక్రవారం ఉదయం మృతుడి బంధువులు ఆర్మూర్ పట్టణ పోలీసు స్టేషన్‌కి చేరుకొని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని అంటూ పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించారు.

డిప్యూటీ తహసీల్దార్ ను తప్పించేందుకు యత్నాలు!
ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున ఓ డిప్యూటీ తహసీల్దార్ అధికారి యాచకుడిని తన్ని, అతని చావుకు కారణమైన దుశ్చర్యకు పాల్పడిన ఘటన వీడియో బయటకు పొక్కింది. ఆ వీడియోను తిలకిస్తున్న వారికి ముమ్మాటికీ తప్పు అధికారిదేనని కనబడుతుంది. టిప్పర్ లారీ డ్రైవర్‌కి ఇందులో ఎలాంటి పాత్ర కనబడటం లేదు. అయితే ఈ క్రమంలో నిందితుడు ఒక ప్రభుత్వ అధికారి కావడంతో ఆయనను తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
తల, తోక లేని సమాధానం ః సిఐ వివరణ
ఆర్మూర్ పట్టణ సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్స్ కాలనీలో ఉంటున్న మందుల మహ్వి తమ్ముడు మందుల సూరజ్ (32) మృతుడుగా తేలిందని తెలిపారు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ కింద పడి చనిపోయినట్లు సిఐ వివరణ ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పేరు, కారు నెంబర్, తన్నిన వీడియో బయటకు పొక్కినా వాటి పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News