కుటుంబ కలహాలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మహాబూబ్ (32) లతీఫా (28) భార్యభర్తలు. మహబూబ్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండేవాడు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, కుమార్తె. వారు మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మంగళవారం దాదాపుగా ఉదయం పిల్లలు ఎప్పటిలాగే యధావిధిగా పాఠశాలకు వెళ్ళిపోయారు. తిరిగి సాయంత్రం పిల్లలు 3:30 గంటలకు పాఠశాల నుండి ఇంటికి వచ్చారు. ఇళ్ళు మూసి ఉండడంతో పిల్లలు ఇంట్లోకి వెళ్ళలేకపోయారు. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన చిన్నారులు ఇంట్లోకి వెళ్ళకుండా బయటనే కూర్చోవడం
గమనించిన చుట్టుపక్కల వారు కిటికీలో నుండి ఇంట్లోకి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ ఉన్న మహబూబ్ కనిపించడంతో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడే అతని భార్య లతీఫా సైతం నేలపై విగతజీవిగా కనిపించింది. దీంతో భార్యను చంపి మహబూబ్ తాను ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పలువురు అనుమానించి విషయాన్ని గ్రామస్తులు పలువురికి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన వారు ఎవ్వరు అందుబాటులో లేకపోవడంతో వారంతా హైదరాబాద్‌లో ఉండడంతో వారు వచ్చిన తరువాత మృతికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.