తీర్పును సవరించిన ఖతార్ కోర్టు: కేంద్రం
న్యూఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారతీయులకు ఉపశమనం లభించింది. వారికి విధించిన మరణశిక్షలను ఖతార్ కోర్టు సవరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. అయితే తగ్గించిన శిక్షలకు సంబంధించిన తీర్పు వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, దీనిపై ఖతార్ పాలకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంటామని మంత్రిత్వశాఖ తెలిపింది.
గతంలో 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందికి ఖతార్‌లో కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ తీర్పు రద్దు కోసం న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తామని భారత ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. అల్ దహ్రాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఈ 8 మంది భారతీయులను గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గత ఏడాది ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే వీరిపై నమోదైన ఆరోపణల గురించి ఖతార్ పాలకులు కాని, భారత ప్రభుత్వం కాని వెల్లడించలేదు.